అలాంటి సమయంలో ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్.. ఆ రూమర్లను కొట్టేసిన రాజీవ్ కనకాల!
అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని తాత నుంచి పుణికి పుచ్చుకున్నారు జూనియర్. ఈ తరంలో నవరసాలను అద్భుతంగా పలికించగల.. సింగిల్ టేక్‌లో ఎలాంటి టఫ్ సీన్‌ను అయినా చేయగల అరుదైన నటుడు. తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు.
క్లాసికల్ డ్యాన్సర్‌గా దేశంలోని పలు ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీఆర్. అనంతరం చదువుపై దృష్టి పెట్టిన ఆయన .. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి మూవీ ఆకట్టుకోకపోయినా నిరుత్సాహాపడకుండా ప్రయత్నించారు. ఈ క్రమంలో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆది సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ శిఖరాగ్రాన్ని తాకింది.

ఇదిలావుండగా.. సినిమాల్లో సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ తాత అడుగుజాడల్లో రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఎన్టీఆర్ మద్ధతు పలికారు. తన మేనమామ చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఖాకీ దుస్తుల్లో , సైకిల్‌పై వెళుతూ ప్రత్యర్ధులపై పంచ్‌లు విసురుతూ, సెటైర్లు వేస్తూ ఎన్టీఆర్ ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చావు అంచులదాకా వెళ్లొచ్చారు.
2009 మార్చి 26న ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా మోతె గ్రామంలో తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్టీఆర్ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని టీడీపీ శ్రేణులు, నేతలు హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు.
ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసి నాడు ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆసుపత్రికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఆసుపత్రి బెడ్ పైనుంచే టీడీపీ కూటమికి ఓటు వేయాలని ఎన్టీఆర్ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత కారణాలు వేరే ఉన్నా టీడీపీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే ఆ సమయంలో ప్రమాద ఘటనలో ఎన్టీఆర్‌తో పాటు ఆయన స్నేహితులు రాజీవ్ కనకాల, రఘు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనపై కీలక విషయాలు పంచుకున్నారు రాజీవ్ కనకాల. ఇటీవల ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆరోజు తాము ఉన్న కారుని మరో వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడని, అప్పట్లో గ్రామాల్లో లైట్లు ఉండేవి కావన్నారు. దీనికి తోడు సైన్ బోర్డులు లేవని, పైగా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో వస్తున్నాడని తెలిసి జనం చీకట్లో కారు వెంట పరుగులు తీశారని రాజీవ్ గుర్తుచేసుకున్నారు.
ఖమ్మంలో సభ విజయవంతమైన తర్వాత.. హైదరాబాద్‌కు బయలు దేరాం.. ఓ ఊరిలో మూల మలుపు తిరుగుతుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిందని.. ఇదంతా రెప్పపాటులో జరిగిందన్నారు. తామంతా షాక్‌కు గురయ్యామని.. తేరుకుని చూస్తే ఇంకా బతికి ఉన్నామా అనిపించిందని రాజీవ్ కనకాల వ్యాఖ్యానించారు. మద్యం తాగి కారు నడుపుతున్నామని వచ్చిన రూమర్లను ఆయన ఖండించారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











