తెరపై సౌరవ్ గంగూలీగా ఆ హీరో .. ఆ హీరోయిన్‌తో దాదా ఎఫైర్‌ని చూపిస్తారా?
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో మేకర్స్ వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయులంతా ఎంతో ఇష్టపడే క్రికెటర్ల జీవితాలు కూడా తెరపై ఆవిష్కరించారు. ఎంఎస్ ధోనీ , కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్ వంటి క్రికెటర్ల జీవితాలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకుల ఆదరను అందుకున్నాయి. తాజాగా మరో దిగ్గజ క్రికెటర్ బయోపిక్ కూడా పట్టాలెక్కనుంది. ఆయనెవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.
వరుస ఓటములు , మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల మధ్య టీమిండియా పగ్గాలు అందుకున్నాడు సౌరవ్. తన దూకుడు, తెగువతో భారత జట్టును నడిపించి .. ప్రపంచ క్రికెట్‌లో విదేశీ జట్ల ఆధిపత్యానికి సవాల్ విసిరి టీమిండియాను మేటి జట్టుగా నిలబెట్టాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీ.. క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌లలో ఒకడిగా తన పేరు లిఖించుకున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు భారతీయ క్రికెట్‌ను శాసించాడు సౌరవ్.

టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన దాదా.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. వీటిలో 38 సెంచరీలు, 107 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ టోర్నీలలో అత్యధిక సెంచరీలు (6) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గంగూలీని అంతా దాదా అని ముద్దుగా పిలుచుకుంటారు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గంగూలీ కొన్నాళ్లు కామెంటేటర్‌గా , బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా క్రికెట్‌కు సేవ చేస్తూనే ఉన్నారు.
ఇక గంగూలీ కెప్టెన్సీలో 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడంతో గంగూలీ లార్డ్స్ మైదానం బాల్కనీలో షర్ట్ విప్పి సంబరాలు చేసుకున్న వీడియోలు అభిమానులకు ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. భారత క్రికెట్‌కు సాహసాన్ని, దెబ్బకు దెబ్బ తీసే ధోరణిని తీసుకొచ్చిన ట్రెండ్ సెట్టర్ గంగూలీ. ఆయన వేసిన పునాదులపై ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టును నడిపించారు.

ఓ సినిమాకు కావాల్సిన ముడిసరుకు ఆయన జీవితంలో ఎంతో ఉంది. అందుకే గంగూలీ బయోపిక్‌పై ఎప్పుడో మేకర్స్ ఫోకస్ చేశారు. 2021 నుంచే ఈ పనులు మొదలవ్వగా గంగూలీ పాత్రలో రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి వారి పేర్ల వినిపించాయి. ఎట్టకేలకు స్వయంగా తన బయోపిక్‌లో నటించేది రాజ్ కుమార్ రావ్ అంటూ గంగూలీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే బాలీవుడ్ స్టార్స్‌తో క్రికెటర్ల ప్రేమాయణం ఎప్పటి నుంచో చూస్తుందే. దూకుడుతో ఉండే గంగూలీని కూడా చాలా మంది భామలు ఇష్టపడ్డారు. ముఖ్యంగా నాటి టాప్ హీరోయిన్ నగ్మాతో గంగూలీ డేటింగ్ చేయడం సినీ, క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. ఎందుకంటే అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయ్యింది. తొలుత వీరిద్దరి వ్యవహారం పుకారు మాత్రమేనని అంతా అనుకున్నారు. కానీ 1999 ప్రపంచకప్ సమయంలో లండన్‌లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకని తిరగడంతో అందరికి షాక్ తగిలింది. ఆ తర్వాత గంగూలీ - నగ్మాలు శ్రీకాళహస్తిలో పూజలు జరుపుతూ మీడియా కంటపడటం కలకలం రేపింది. అయితే అనూహ్యంగా ఈ జంట విడిపోయింది. మరి గంగూలీ బయోపిక్‌లో నగ్మాతో ప్రేమాయణాన్ని టచ్ చేస్తారా? నగ్మా క్యారెక్టర్‌ను ఎవరు వేస్తారని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











