Peddi: పెద్ధి రిలీజ్‌పై రామ్ చరణ్ క్లారిటీ... నిహారికకు అన్నయ్య స్పెషల్ రిక్వెస్ట్!
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలపై గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో పాటు మరికొన్ని కారణాలతో పెద్ది వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో గత కొద్దిరోజులు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ స్వయంగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యెందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాలతో పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్‌కు కూడా మంచి పేరొచ్చింది. మరికొద్దిరోజుల్లో సినిమాను చూస్తామని అంతా భావిస్తుండగా పెద్ది వాయిదా పడనుందని రూమర్స్ బయల్దేరాయి. దీనికి కారణం నిర్మాత ఎస్‌కేఎన్.
ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్‌కేఎన్‌లు మాట్లాడుతూ.. తామునిర్మించిన చెన్నై లవ్ స్టోరీని జూన్ 26న తీసుకున్నాం.. కానీ అదే రోజున పెద్ది వస్తోందని, త్వరలోనే మా సినిమాను రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చెప్పడంతో మెగా అభిమానులు షాకయ్యారు. ఇది చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించడంతో ఎస్‌కేఎన్ స్పందించారు. పెద్ది జూన్ 26న రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూసి పొరపడ్డామని, దీనిని తప్పుగా తీసుకోవద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సినిమా షూటింగ్ పూర్తి కాలేదని, రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతుందని మరికొన్ని రూమర్స్ వచ్చాయి. అందుకే ఈ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస మూవీ టీమ్ నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమంలో చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిహారిక టీమ్ రిలీజ్ చేసింది.
రాకాస హీరో హీరోయిన్లు సంగీత్ శోభన్, నయన్ సారికతో పాటు ఇతర టీమ్‌ను అభినందించారు రామ్ చరణ్. ఆల్‌మోస్ట్ ఇండియానా జోన్స్ లెవల్‌లో తీశారని ప్రశంసించారు. పెద్ది లేట్ అవడం లేదని కొంచెం ప్రమోట్ చేయండి.. వాయిదా అని బయట బాగా వింటున్నానని చరణ్ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తన చెల్లెలితో తన సినిమాను ప్రమోట్ చేయమని కోరారు. రామ్ చరణ్ క్లారిటీతో ఇప్పటి వరకు పెద్ది సినిమా రిలీజ్‌పై నెలకొన్న గందరగోళానికి చెక్ పడినట్లయ్యింది.


Click it and Unblock the Notifications


















