Game Changer Teaser Review : వాడంత చెడ్డోడు లేడు, అన్ ప్రిడిక్టబుల్ ... గేమ్ ఛేంజర్ టీజర్ కేక!
తమిళ దర్శక దిగ్గజం శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. శంకర్ కెరీర్‌లో స్ట్రైట్‌గా తెలుగులో టేకప్ చేస్తున్న తొలి మూవీ కావడంతో పాటు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ లక్నోలో టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించింది. మరి గేమ్ ఛేంజర్ టీజర్ ఎలా ఉంది? శంకర్ తన మార్క్ చూపించారా? రామ్ చరణ్ లుక్ , గెటప్ ఎలా ఉంది? ఈ వివరాల్లోకి వెళితే..
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు -2 దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని ఈ స్టార్ డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమై విమర్శలు ఎదుర్కొంటూ ఉండటంతో శంకర్ కూడా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇదిలాఉండగా.. క్రేజీ కాంబినేషన్‌కు తోడు, భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని ఫిలింనగర్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా. ఆంధ్రాలో రూ.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 కోట్లు, నైజాంలో రూ . 55 కోట్ల మేర వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీజర్ , ట్రైలర్ తర్వాత బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి గేమ్ ఛేంజర్ టీజర్ ఎలా ఉందో పరిశీలిస్తే .. దాదాపు 1.25 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ప్రారంభంలో కొండ ప్రాంతంలో జేసీబీలతో తవ్వకాలు జరుగుతుంటాయి, ఇంతలో పంచెకట్టులో ఉన్న చరణ్‌ని ఊరి జనం భుజాలపై మోస్తూ జేజేలు పలుకుతుంటారు. బేసిగ్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడని, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు లేడు అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది. అలాగే ఓ పోర్ట్ , ఈ ప్రాంతంలో జరిగే ఓ రాజకీయ పార్టీ సమావేశాన్ని చూపిస్తారు.
ఈ టీజర్‌లో తెల్లచొక్కా, తెల్ల లుంగీతో పాటు సూటు బూటు, ఓ క్రీడాకారుడిగా మూడు గెటప్స్‌లో కనిపించారు రామ్ చరణ్. ఏం చేశాడ్రా వాడు అని అంతా ఆశ్చర్యపోతుండగా.. ఐయామ్ అన్ ప్రిడిక్టబుల్ అంటూ చరణ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. శంకర్ మార్క్ భారీతనం, విజువల్ వండర్ లాంటి సాంగ్స్‌పై టీజర్‌లో హింట్ ఇచ్చారు. అయితే స్టోరీ లైన్ ఏంటీ? ఏ ఇష్యూ చుట్టూ గేమ్ ఛేంజర్ తిరుగుతుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్‌లో పెట్టారు శంకర్. మొత్తానికి టీజర్‌తో గేమ్ ఛేంజర్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. మరి అసలు కథ ఏంటీ? శంకర్ ఏం చెప్పారు? ఏమైనా ట్విస్ట్‌లు ఉన్నాయో లేదో తెలియాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











