Ram Charan's Twins Names: ఘనంగా రామ్ చరణ్- ఉపాసన కవలల నామకరణం.. వారసులతో చిరంజీవి సందడి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జనవరి 31వ తేదీ రాత్రి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవల పిల్లలకు (ఆడబిడ్డ, మగబిడ్డ) జన్మనిచ్చారు. దాంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని తాకాయి. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా రామ్ చరణ్‌కు వారసుడు జన్మించడంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిరంజీవికి మనవడు, మనవరాళ్లు పుట్టడంతో ఈ ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు విషెస్ తెలియజేశారు. తాజాగా ఈ చిన్నారులకు మెగా ఫ్యామిలీ ఘనంగా నామకరణం జరిపించింది. ఈ వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ - ఉపాసనలకు తొలి సంతానంగా రెండేళ్ల క్రితం ఆడపిల్ల క్లీంకారా జన్మించింది. ఈ క్రమంలో గతేడాది ఉపాసన రెండోసారి గర్భం దాల్చారు. దాంతో రామ్ చరణ్‌కు వారసుడు పుట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కోరుకున్నారు. ఈసారి డబుల్ సెలబ్రేషన్స్ అంటూ తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు చరణ్ - ఉపాసన ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. అందరీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాసన బాబు, పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తాత మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఉపాసన ప్రసవించినట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అనంతరం అపోలో ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. కొణిదెల, కామినేని కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. రామ్ చరణ్ - ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట్లో శుభం కలగాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎక్కడెక్కడి నుంచో, ఎంతోమంది కోరుకున్నారు. ఆ భగవంతుడి దయతో, హనుమంతుడి కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఆ శుభవార్తను మీ అందరితో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఉపాసనకు విజయవంతంగా డెలివరీ చేయడంతో పాటు కంటికి రెప్పలా చూసుకున్న అపోలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
అయితే రామ్ చరణ్ - ఉపాసనల కవల పిల్లలకు ఏ పేర్లు పెట్టబోతున్నారు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడిచింది. తాజాగా ఈ చిన్నారుల నామకరణోత్సవం ఘనంగా జరిగింది. కేవలం కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో పాటు చరణ్ దంపతుల కవల పిల్లలకు ఏ పేరు పెట్టింది అధికారికంగా తెలియజేశారు.
వేద పండితులు, జ్యోతిష్యుల సూచనను అనుసరించి ఈ బిడ్డలకు శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని పేరు పెట్టినట్లు మెగాస్టార్ పేర్కొన్నారు. అలాగే పేర్లు వాటి అర్ధాన్ని కూడా ఆయన వివరించారు. శివరామ్ అనే పేరును తన అసలు పేరు శివశంకర వరప్రసాద్‌లోని శివ అనే అక్షరం నుంచి రామ్ చరణ్‌లోని రామ్ అనే అక్షరాల కలయికగా తీసుకున్నట్లు చిరు వివరించారు. రెండు శాశ్వత ఆదర్శాల లోతైన కలయిక. శివ అనే పేరును శివ శంకర వరప్రసాద్ నుంచి ప్రేరణగా తీసుకున్నాం. ఇది అంతర్గత బలం, ఆధ్యాత్మిక లోతు, నిశ్చలతను ప్రతిబింబిస్తుంది. రామ్ చరణ్‌లోని రామ్.. నీతి, కరుణ, ధైర్యాన్ని సూచిస్తుందన్నారు. కాగా ఉపాసన కామినేని పూర్వీకుల గ్రామం ఉన్న దోమకొండ సంస్థానంలో వారి పెద్దలు శివరామ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని దేవతా మూర్తి ఆశీస్సులు ఉండేలా బిడ్డకు శివరామ్ అనే పేరు పెట్టినట్లు చిరు తెలిపారు.
అన్వీర దేవి పేరు విషయానికి వస్తే.. అన్ అంటే అనంతమైన, వీర అంటే ధైర్యం. దివ్య స్త్రీతత్వంలోని అరుదైన శక్తికి వ్యక్తీకరణ. కనక దుర్గాదేవి ఆశీర్వాదాలతో ప్రేరణ పొందిన అన్వీర.. నిర్భయత, దైవిక ర క్షణను సూచిస్తుంది. దయ, ధైర్యం, అచంచలమైన బలాన్ని ప్రతిబింబించే పేరు అని చిరంజీవి పేర్కొన్నారు. తన సతీమణి సురేఖకు విజయవాడలోని కనకదుర్గా దేవి ఇష్టదైవమని.. దుర్గమ్మ తల్లి నామాలలో అన్వీరా దేవి కూడా ఒకటని మెగాస్టార్ పేర్కొన్నారు.
శివ రామ్, అన్వీరా దేవిలు వారి అందమైన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించే సందర్భంగా మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నామని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతుండగా.. శివరామ్, అన్వీరా దేవిలకు సినీ ప్రముఖులు, అభిమానులు ఆశీస్సులు అందజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











