చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు.. మిమ్మల్నీ బాధపెట్టి ఉంటే..
Chiranjeevi - Ram Gopal Varma: ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారు వర్మ. శివ, సత్యా, సర్కార్ వంటి సినిమాలతో భారత సినిమా చరిత్రలో తన ముద్ర వేసిన ఆర్జీవీ, నాగార్జునతో చేసిన 'శివ' ద్వారా తెలుగు సినిమాకు కొత్త దిశ చూపించారు. ప్రస్తుతం కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే?
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తన కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. 1989లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా నయా ట్రెండ్ క్రియేట్ చేసింది. అలా తెలుగు సినీ ఇండస్ట్రీకి మైలురాయిగా మారింది. ఈ సినిమా అక్కినేని నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టగా, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా సినిమాలకు టార్చ్ బేరర్ గా మారింది. అలాంటి కల్ట్ మూవీని 4K రీస్టోరేషన్‌తో మళ్లీ థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 14న "శివ 4K" ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మతో పాటు నాగార్జున కూడా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ క్లాసిక్ చిత్రానికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్‌లు వీడియో సందేశాల ద్వారా ఆర్జీవీ, నాగార్జునకు అభినందనలు తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా "శివ"పై తన ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
చిరంజీవి తన వీడియోలో మాట్లాడుతూ, "శివ సినిమా చూసినప్పుడు నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సాధారణ సినిమా కాదు, ఒక విప్లవం. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం చెప్పింది. ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయింది. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్ అద్భుతం. అమల, రఘువరన్ లాంటి నటీనటులు ప్రతి ఫ్రేమ్‌కి జీవం పోశారు. ఈ సినిమా మళ్లీ రీ-రిలీజ్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేటి తరానికి ఇది తప్పక చూడాల్సిన టైమ్‌లెస్ ఫిల్మ్. రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ అప్పట్లో కొత్తదనం తెచ్చాయి. ఆయన తెలుగు సినిమాకి కొత్త దారి చూపించారు. హ్యాట్సాఫ్ టు ఆర్జీవీ" అని పేర్కొన్నారు.
మెగాస్టార్ మాటలు వినగానే అభిమానులు, సినీ వర్గాలు విపరీతంగా స్పందించాయి. చిరంజీవి తరహా స్టార్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం రామ్ గోపాల్ వర్మకే కాకుండా మొత్తం "శివ" టీమ్‌కు జోష్ ను ఇచ్చాయి. ఈ వీడియో చూసిన తరువాత రామ్ గోపాల్ వర్మ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో చిరంజీవి వీడియోను షేర్ చేస్తూ ఆయనకు కృతజ్ఞతలతో పాటు క్షమాపణలు కూడా తెలిపారు.
"శివ సినిమాని ప్రమోట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చిరంజీవి గారు. నేను ఎప్పుడైనా అనుకోకుండా మిమ్మల్ని బాధపెట్టినట్లయితే క్షమించండి. మీ విశాల హృదయానికి మళ్లీ ధన్యవాదాలు." అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కేవలం కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో వర్మ మెగా కుటుంబంపై చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి స్టార్లపై సైటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఆర్జీవీ వినయంతో,గౌరవంతో స్పందించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పటిలాగే పెద్ద మనసుతో వ్యవహరించారు. వర్మ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎప్పుడూ స్పందించకపోవడం, ఇప్పుడు 'శివ' రీ-రిలీజ్ సందర్భంగా ఆ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియో విడుదల చేయడం ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపించింది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











