నాలుక చీరేస్తాం.. RGVపై నాయి బ్రహ్మణుల ఆగ్రహం.. కేసు నమోదు
దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఓ టెలివిజన్ షోలో నాయి బ్రహ్మణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందులకు గురిచేసే అవకాశం కనిపిస్తున్నది. వర్మ వ్యాఖ్యలపై నాయి బ్రహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తమ కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తమ మనోభావాలను కించపరిచాడు. ఆయన బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని పోలీసులకు నాయి బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అనంతరం మీడియాతో నాయి బ్రహ్మణ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఇటీవల కులాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం సర్వసాధారణమైంది. తాజాగా రిలీజైన పవర్‌స్టార్ సినిమా ప్రమోషన్‌లో వర్మ తమను కించపరిచే విధంగా మాట్లాడారు. అందుకు ఆయన బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. మరోమారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు.

ఇక ముందు ఎవరూ కూడా కులాలను టార్గెట్ చేస్తూ మాట్లాడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. కులాలను కించపరిస్తే వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అని నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు అన్నారు. మరోసారి తమ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అని వారు హెచ్చరించారు. తమ కులాన్నే కాకుండా ఏ కులాన్ని కూడా కించపరచవద్దని హెచ్చరించారు.
తాజాగా రాంగోపాల్ వర్మ రూపొందించిన పవర్‌స్టార్ చిత్రం వివాదంలో కూరుకుపోయింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితంలోకి కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని సినిమాను రూపొందించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ టెలివిజన్ షోలో వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయనపై కేసు నమోదు చేసే వరకు వెళ్లడం గమనార్హం.


Click it and Unblock the Notifications











