గాంధీ మాన్యుపులేటర్.. ఉగ్రవాదులే భయపడేంతగా.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గతిని మార్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని ఆయన ఇక్కడి వరకు వచ్చారు. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు తెలుగు తెరను దున్నేస్తున్న కాలంలో శివతో ఓ కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగించారు. సినిమా మేకింగ్ స్టైల్‌ను మార్చేసి కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమా ప్రస్థానం గురించి చెప్పాల్సి వస్తే.. ఖచ్చితంగా శివకి ముందు, శివకి తర్వాత అన్నంతగా టాలీవుడ్‌లో తన ముద్ర వేశారు.
ఎవరికీ అంతు చిక్కని క్యారెక్టర్‌గా, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వర్మ నిలుస్తున్నారు. క్రియేటివ్ జీనియస్‌గా మన్ననలు అందుకున్న ఆర్జీవీ గతంలోలా తన మార్క్ చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ వర్మకి ఉన్న క్రేజ్ ఏ డైరెక్టర్‌కు లేదన్నది వాస్తవం. ఈ తరం పిల్లలు ఆయనను బాగా ఇష్టపడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రలో నటించారు. తెరపై ఆయన కనిపించగానే థియేటర్లు దద్ధరిల్లిపోయాయంటే అతిశయోక్తి కాదు.

సినిమాలు తీసుకుంటూ తనదైన లోకంలో ఉండే వర్మపై రాజకీయపరమైన విమర్శలు కూడా వచ్చాయి. జగన్ సారథ్యంలోని వైసీపీకి ఆర్జీవీ అండగా నిలిచారంటూ టీడీపీ, జనసేన సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వైఎస్ జగన్‌కు బాగా ప్లస్ అయ్యిందనే వాదనలు ఉన్నాయి. తాజా ఎన్నికల సమయంలోనూ జగన్ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై అదే స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు నిత్యం టీడీపీపై విమర్శలు చేస్తూ.. వైసీపీకీ అండగా నిలిచేలా ఆయన ట్వీట్లు ఉండేవి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ -జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు.
అయినప్పటికీ పలు ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ సత్యాగ్రహాన్ని, అహింసను ఆయుధంగా చేసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆర్జీవీ చెప్పారు. అప్పటి మనుషుల మనస్తత్వాలను గాంధీజీ చదివేసి, అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులను ద్వితీయ శ్రేణి మనుషులుగా చూసేవారని, దాదాపు మనల్ని బ్యాన్ చేసినట్లుగా అక్కడి అధికారులు ఓ చట్టం తెచ్చారని వర్మ గుర్తుచేశారు.

ఓ రోజున దీని గురించి అందరూ మాట్లాడుకుంటుండగా ఓ వ్యక్తి నిలబడి.. నా ఇంట్లోకి ఎవరైనా పోలీస్ వ్యక్తి వచ్చి, ఐడీ కార్డ్ చూపించమని అడిగితే వాడిని చంపేస్తానని ఆవేశంగా మాట్లాడాడని ఆర్జీవీ తెలిపారు. ఈ ప్రాసెస్‌లో నేను చనిపోయినా పర్లేదు అన్నట్లుగా చెప్పాడని వర్మ వెల్లడించారు. అప్పుడు గాంధీ జోక్యం చేసుకుని .. నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నా, నేను కూడా ఈ పోరాటంలో చనిపోవడానికి సిద్ధంగా వున్నానని తెలిపారు. కానీ నేను ఎవరినీ చంపడానికి మాత్రం సిద్ధంగా లేనని చాలా శాంతియుతంగా చెప్పారని రామ్ గోపాల్ వర్మ గుర్తుచేశారు.
మాఫియా ఒక బిజినెస్ అయితే, ఉగ్రవాది అనే వాడు తన నమ్మిన సిద్ధాంతం కోసం వాడే చనిపోతాడని అందుకే టెర్రరిస్ట్‌కి ఎక్కువ భయపడతామని ఆయన విశ్లేషించారు. దీని ఆధారంగానే మనం దెబ్బలు తిందాం, మనం కొట్టొద్దు.. మనం చంపోద్దు, మనం చచ్చిపోదామనే సూత్రాన్ని గాంధీజీ భారత స్వాతంత్య్ర పోరాటంలో వాడారని ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి థాట్ ఎవరికీ రాలేదని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











