IBOMMA రవి వివాదంపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. టికెట్ రేట్లు పెంచితే అంటూ..
iBomma Controversy: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. IBOMMA రవి వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ, ఆర్జీవీ (RGV)తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీకి మద్దతుగా నిలుస్తున్న వారి వాదనలను చీల్చిచెండాడు. "టికెట్ రేట్లు పెంచితే పైరసీ సరి అనడం అత్యంత ప్రమాదకరం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి వివాదంపై వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే..?
రామ్ గోపాల్ వర్మ తన తన పోస్ట్‌లో ఐబొమ్మ రవి వివాదం స్పందించారు. పైరసీని ఆపడం అంత సులభం కాదని, సమస్య టెక్నాలజీ లేదా పోలీసుల వైఫల్యం కాదని, అసలు సమస్య పైరసీ చూసే ప్రేక్షకుల సంఖ్యే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో పైరసీపై ఎలాంటి మొహమాటం లేకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'రోబిన్ హుడ్ రవి'అనే పేరుతో పైరసీని హీరోలా కొందరు చూపించడం, పైరసీని న్యాయబద్ధం చేయడానికి ప్రయత్నించడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. పైరసీని సమర్థించే వాదనలు ఎంత ప్రమాదకరమైనవో, సమాజం ఎటువంటి దిశలో నడుస్తోందో అర్థం చేసుకోవాలన్నారు.

'రోబిన్ హుడ్'తో పోల్చడం సరైనదా? అనే ప్రశ్నకు సమాధానంగా వర్మ ఘాటుగా స్పందించారు. "రోబిన్ హుడ్ హీరో కాదు. నేటి నిర్వచనం ప్రకారం ఆయన ప్రపంచపు మొదటి టెర్రరిస్ట్. ధనవంతులను దోచుకుని పేదలకు ఇచ్చే వ్యక్తిని ఎలా మహనీయుడిగా చూపుతారు?" అని ప్రశ్నించారు. ధనవంతుడు కావడం నేరమా? అలా భావించడం ఒక ప్రమాదకరమైన భావజాలం అని పేర్కొన్నారు. రోబిన్ హుడ్ లాంటి పాత్రలను ప్రోత్సహించడం సమాజానికి ప్రమాదకరం అని వర్మ తేల్చి చెప్పారు.
IBOMMA రవి అరెస్టుపై కొందరు "థియేటర్ టికెట్ రేట్లు ఎక్కువ... అందుకే పైరసీ చూడాల్సి వస్తుంది" అనే కామెంట్లు చేస్తున్నారన్న అంశంపై కూడా ఆర్జీవీ స్పందించారు. "సినిమా ఖరీదు? పాప్‌కార్న్ రేట్లు ఎక్కువా? టికెట్ రేట్లు పెంచితే పైరసీ చేస్తామని చెప్పేవారు చాలా ప్రమాదకరమైన ఆలోచనలో ఉన్నారు. సినిమా టికెట్ ఖరీదైందన్న కారణంతో పైరసీ చూడటం న్యాయబద్దమని చెప్పడం, అతి పెద్ద తప్పు అని ఆయన అన్నారు. "ఈ లాజిక్ ప్రకారం బీఎంబ్యూ కారు (BMW)ను కొనకుండా.. షోరూమ్ నుంచి దోచుకోవాలా? నగలు ఖరీదైనవి దోచుకుని పేదలకు పంచాలి. ఇది సమాజాన్ని అస్తవ్యస్తం చేసే ఆలోచన" అని వర్మ ఘాటుగా స్పందించారు. ఈ వాదనలు ఇలానే కొనసాగితే అరాజకత్వం రాజ్యమేలుతుందని హెచ్చరించారు.
పైరసీని ఆపడం కేవలం టెక్నాలజీతో కానీ, పిరేట్లను పట్టుకోవడంతో కానీ సాధ్యం కాదని అన్నారు. అసలు సమస్య పైరసీ కంటెంట్‌ను చూసే ప్రేక్షకులే అని ఆయన విమర్శించారు. "ఎవరైనా దొంగిలించిన కంటెంట్ చూడటానికి సిద్ధంగా ఉంటే, అలాంటి వారికి అందించడానికి రవిలాంటి వాళ్లు ఎప్పుడూ ఉంటారు" అంటే డిమాండ్ ఉన్నంతవరకు పైరసీ ఆగబోదని స్పష్టం చేశారు. "ప్రజలు పైరసీ చూడటానికి కారణం నీతి, న్యాయం, విప్లవం కాదు.. 'సౌకర్యం', 'ఉచితం' కావడమే" అని వర్మ పేర్కొన్నారు.
అంతేకాకుండా సినీ రంగంలోని చాలామంది కూడా పైరసీ చూస్తారని, తాను కూడా చూసినట్లు షాకింగ్‌గా అంగీకరించారు. పైరసీని నిజంగా తగ్గించాలంటే కేవలం లీక్ చేసే వారిని కాదు, చూసేవారినీ శిక్షించాలి అని ఆయన సూచించారు. "పైరసీ చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేసి పేర్లు పబ్లిక్ చేస్తే... త్వరగానే ఇది పెద్ద నేరమని అందరికీ అర్థమవుతుంది" అని వర్మ అభిప్రాయపడ్డారు. "పైరసీ విషయంలో నైతిక ప్రసంగాలు పనిచేయవు... భయమే పనిచేస్తుంది" అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











