నీ పతనం కోసం వాళ్లు వెయిటింగ్.. ధురంధర్ డైరెక్టర్‌కు రామ్ గోపాల్ వర్మ హెచ్చరిక..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).. ఆర్జీవీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ వివాదం ఉందో అక్కడ నేనున్నా అంటూ ఉండే వర్మ ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్ అయ్యాడు. అంతకుముందులా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రతి విషయంలో తలదూర్చేవాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆదిత్య ధర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తేసిన వర్మ, అదే సమయంలో పరిశ్రమలో ఆయన పట్ల ఉన్న అసూయను కూడా బయటపెట్టారు వర్మ. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఆదిత్య ధర్‌పై వర్మ ప్రశంసలు
ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఒక మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదిత్య ధర్ తీసిన స్పై థ్రిల్లర్ ధురంధర్ (Dhurandhar) తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. ఆ సినిమా చూసిన తర్వాత తాను ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయానని కూడా వెల్లడించారు. ఆదిత్య ధర్ కథను తెరపై చూపించే విధానం పూర్తిగా కొత్తదనాన్ని తీసుకువచ్చిందని వర్మ అన్నారు. 'ఆయన సినిమా తీసే విధానం స్క్రీన్‌పైన కథ చెప్పే గ్రామర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇకపై సినిమాలు పాత తరహాలో ఉండవు. ఆయన ప్రభావం హిందీకి మాత్రమే కాదు, అన్ని భాషల సినిమాలపై కనిపిస్తుంది' అని వర్మ వ్యాఖ్యానించారు.

టాలీవుడ్‌లో కూడా ప్రభావం
ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ చేసిన మరో వ్యాఖ్య ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ చూసిన తర్వాత టాలీవుడ్‌లో రూపొందుతున్న కొన్ని భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు కూడా తమ షూటింగ్‌లను ఆపి మళ్లీ రీషూటింగ్ చేస్తున్నాయని ఆయన అన్నారు. 'ఇది నిర్మాతలకు భారీ ఖర్చు పెరగడానికి కారణమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు మళ్లీ షూట్ చేయడం అంటే పెద్ద ఆర్థిక భారమే. అందుకే కొందరు దర్శకులు ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాళ్లను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు'అని వర్మ వ్యాఖ్యానించారు.
ఇండస్ట్రీలో అసూయ?
ఇక్కడే ఆగకుండా వర్మ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ విజయాన్ని చూసి ఇండస్ట్రీలో కొందరు అసూయతో ఉన్నారని అన్నారు. 'ఆదిత్య ధర్, ఆయన భార్య యామి గౌతమ్ ఎప్పుడు తప్పు చేస్తారా? ఎప్పుడు కింద పడతారా? అని ఇండస్ట్రీలో కొందరు వారి పతనం కోసం ఎదురుచూస్తున్నారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఇదే సమయంలో యామీ గౌతమ్ తాజా సినిమా హక్ (Haq) గురించి కూడా వర్మ మాట్లాడారు. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో ఆమె నటనకు మంచి స్పందన వస్తోందని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి, నయా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్ 2 ( Dhurandhar: The Revenge)రాబోతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇందులో భారత గూఢచారి హమ్‌జా పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానున్నది. ఇక ఈ ఆర్జీవీ వ్యాఖ్యలపై సినీ వర్గాలు ఎలా స్పందిస్తాయో, అలాగే 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











