Ram Gopal Varma: వ్యూహం, శపథం రిలీజ్ డేట్లు ప్రకటన.. వారం గ్యాప్‌లోనే రెండు సినిమాలు
ఒక్కప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తెరకెక్కించిన సెన్సేషనల్ డైరెక్టర్.. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా కాంట్రవర్శీ మూవీలు చేస్తూ వివాదాల్లో భాగం అవుతున్నాడు రాంగోపాల్ వర్మ. మరీ ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్.. వరుసగా పొలిటికల్ చిత్రాలనే చేస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు.
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీనే 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేశారు.

'వ్యూహం' సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సినిమాను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈ చిత్రం ఇక విడుదలయ్యే అవకాశం లేదని అంతా అనుకున్నారు.
వివాదాస్పదమైన అంశాలతో రూపొందిన 'వ్యూహం' మూవీ విడుదలపై ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయాయని దర్శకుడు రాంగోపాల్ వర్మ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన విడుదల చేస్తామని సోషల్ మీడియాలో చెప్పాడు. ఇప్పుడు అదే రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను వదిలి మరోసారి కన్ఫార్మ్ చేశాడు.
'వ్యూహం' మూవీని ఫిబ్రవరి 23వ తేదీన విడుదల చేస్తామని చెప్పిన రాంగోపాల్ వర్మ.. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన 'శపథం' చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా అదే పోస్టర్‌లో రివీల్ చేశాడు. దీని ప్రకారం ఈ సీక్వెల్ మూవీ మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఒక వారం వ్యవధిలోనే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'వ్యూహం', 'శపథం' చిత్రాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అవగా.. వాటికి మంచి స్పందన లభించింది.


Click it and Unblock the Notifications











