VYOOHAM: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్ లేదు.. ఆసక్తికరంగా వ్యూహం టీజర్ 2
టాలీవుడ్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ కాంట్రవర్శీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. గతంలో ఎన్నో జోనర్లలో ఉత్తమ చిత్రాలను తెరకెక్కించిన ఈయన.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా సున్నితమైన రాజకీయ అంశాలతోనే సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాడు. ఇలా ఎక్కువగా ఏపీ పాలిటిక్స్ మీదనే ఫోకస్ చేస్తూ వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఇప్పుడు 'వ్యూహం' అనే చిత్రాన్ని రూపొందిస్తోన్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న కాంట్రవర్శీ మూవీనే 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎదురైన సమస్యలు, వాటిని అతడు అధిగమించిన తీరును చూపిస్తూ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో నిజమైన అంశాలతో ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజాగా రిలీజ్ అయిన రెండో టీజర్ 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదం' జరిగిన సంఘటనతో ప్రారంభం అయింది. ఆ వెంటనే ప్రతిపక్ష నాయకులు సమావేశం అవడంతో పాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని పోలీసులు విచారించిన తీరును చూపించారు. ఫస్ట్ టీజర్‌లో లేని రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఇందులో హైలైల్ చేశారు. అలాగే, ఓ సినీ ఫ్యామిలీని కూడా ఇందులో బాగా చూపించారు. అంటే.. ఆ కుటుంబం మొత్తాన్ని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నాలు చేసినట్లు దీనిబట్టి అర్థం అవుతోంది.
ఇక, 'వ్యూహం' రెండో టీజర్ చివర్లో పవన్ కల్యాణ్ పాత్రను చూపించిన తర్వాత చంద్రబాబు పాత్రధారితో ఓ వ్యక్తి 'ఎప్పుడో అప్పుడు మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారుగా' అని అంటాడు. దీనికి ఆయన 'వాడికి అంత సీన్ లేదు. తనను తానే పొడుచుకుంటాడు' అని బదులిస్తాడు. ఇలా ఈ టీజర్ ముగిసింది. మొత్తంగా ఇది చూస్తుంటే జగన్‌మోహన్ రెడ్డిని హైలైట్ చేసి.. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2024 ఎలెక్షన్‌కు ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











