Rana Dagguabati మరో పాన్ ఇండియా మూవీ.. నిర్మాతలు, దర్శకులు ఎవరంటే..
బాహుబలి తర్వాత విభిన్నమైన ఎంపిక చేసుకొంటున్న టాలీవుడ్ కండలవీరుడు రానా దగ్గుబాటి మరో ప్యాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాత సీహెచ్ రాంబాబుతో కలిసి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్టు విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
ఇక నిర్మాత ఆచంట గోపినాథ్ నిర్మించిన సినిమాల విషయానికి వస్తే... నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పటికే కథకు రానా దగ్గుబాటి ఓకే చెప్పారు. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం అని అన్నారు.

ఇక రానా దగ్గుబాటి కెరీర్ విషయానికి వస్తే... తాజాగా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో రానా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. త్వరలోనే వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం చిత్రం విడుదల కానున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











