రానా మరో సెన్సేషనల్ ప్రాజెక్టు.. ఎవరూ గుర్తుపట్టని విధంగా భళ్లాలదేవ ఫొటో వైరల్!
బాహుబలి ఘన విజయం తర్వాత రానా దగ్గుబాటి క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాథీ మేరే సాథీ, హౌస్‌ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా, అమ్మీ విర్క్, సంజయ్ దత్ లాంటి వారితో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు.
ఇలా క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం మరో సంచలన ప్రాజెక్టులో నటించడానికి రంగం సిద్ధమవుతున్నది. రానాతో బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇందుకోసం రానా, కరణ్ జోహర్ ఇద్దరు ఇటీవల సమావేశమై చర్చించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా, తెలుగులో వేణు ఊడుగుల తెరకెక్కించే విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో జరిగే ఈ కథలో రానా ఓ ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తున్నది.
అంతేకాకుండా రానా దగ్గుబాటి 1945 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తున్నది. తాజాగా గుర్తుపట్టనంత వీలుగా రానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ముతక డ్రస్సులో, గెడ్డంలో రానా లుక్ వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











