సాయి పల్లవి, రానా మొదలు పెట్టేశారు.. విరాట పర్వం స్టార్ట్
యంగ్ హీరో దగ్గుబాటి రానా తన కొత్త సినిమాను మొదలు పెట్టేశాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రానాకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి ఆడిపాడనుంది. ఈ సినిమాకు విరాట పర్వం అనే ఆసక్తికర టైటిల్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, ఎమెల్యే గొట్టిపాటి రవి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వెంకటేష్ తొలి క్లాప్ కొట్టగా ఎమెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చుతున్నారు. ఇతర చిత్ర వివరాలు మరికొద్ది రోజుల్లో తెలపనున్నారు. సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా తెరకెక్కనున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై రూపొందనుంది.

వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. 'నీది నాది ఒకే కథ' లాంటి డిఫెరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. రానా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, సాయి పల్లవికి కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉండటం కారణంగా లేట్ అవుతూ వచ్చింది.
దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి రాజకీయ పరిస్థుతుల నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండేలా వేణు ఉడుగుల 'విరాట పర్వం' స్క్రిప్ట్ రూపొందించారని సమాచారం. 'పడి పడి లేచే మనసు' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి మళ్ళీ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సాయి పల్లవి కెరీర్ లో రానాసరసన నటించనుండటం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.


Click it and Unblock the Notifications











