వాళ్ల బాటలోనే దగ్గుబాటి రానా: ఈరోజు సాయంత్రమే అప్‌డేట్ ఇస్తామంటూ ప్రకటన
కెరీర్ ఆరంభంలో వరుస పెట్టి సినిమాలు చేశాడు టాలీవుడ్ హంక్ దగ్గబాటి రానా. అయితే, కొన్నేళ్లుగా అతడు సినిమాల వేగం బాగా తగ్గించాడు. దీంతో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అతడు వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' (రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్) అనే సినిమా చేస్తున్నాడు. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో రూపొందుతోన్న 'విరాట పర్వం' రిలీజ్ డేట్‌పై తాజాగా చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల తేదీని రివీల్ చేస్తామని అందులో పేర్కొంది. ఇక, ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న గెటప్‌లో ఉండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా నటిస్తోంది. నక్సలైట్ ఉద్యమం సమయంలో వీళ్ల మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కోణంతో సినిమా రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ మూవీలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉండగా, సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో అప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ అత్యధిక కలెక్షన్లు సాధించి.. సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో షూటింగ్ పూర్తయి ఆగిపోయిన సినిమాలతో పాటు.. చిత్రీకరణ జరుపుకుంటోన్న ప్రాజెక్టుల నుంచి వరుసగా రిలీజ్ డేట్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'విరాట పర్వం' విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











