Jani Master Case : జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్.. కోర్ట్ సంచలన ఆదేశాలు!
తన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కేసుకు సంబంధించి ఆధారాలను సంపాదించి చిక్కు ముడులు విప్పాలని పోలీసులు వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేయగా.. కోర్టు అందుకు అనుమతించింది కూడా. అయితే తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.
తనపై అత్యాచారం చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ జానీ మాస్టర్‌పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం కలకలం రేపింది . దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే తనపై ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి.
తొలుత బెంగళూరులో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ కాసేపటికే పోలీసులు వీటిని ఖండించారు. పక్కా సమాచారంతో గోవాలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఆయనను రహస్య ప్రదేశంలో విచారించి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
దీంతో జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు తొలి నుంచి యోచిస్తున్నారు. తద్వారా కేసులో చిక్కుముడులను విప్పి, దర్యాప్తును త్వరగా ఫినిష్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఫోక్సో కోర్టు జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే తొలిరోజు విచారణను పూర్తి చేసిన న్యాయస్థానం.. రెండో రోజు కస్టడీలోకి తీసుకుంది. తొలుత నార్సింగి స్టేషన్ నుంచి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం, తాము సేకరించిన ఆధారాలను జానీ మాస్టర్ ముందు పెట్టి పోలీసులు విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జానీ మాస్టర్‌ను విచారించే క్రమంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పోలీస్ కస్టడీకి కోర్ట్ అనుమతించే ముందే థర్డ్ డిగ్రీ గురించి కోర్ట్ స్పష్టంగా చెప్పింది. జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, ఆయన లాయర్ సమక్షంలోనే విచారణ నిర్వహించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.


Click it and Unblock the Notifications











