Jani Master Case : జానీ మాస్టర్ బయటపడతారా... కోర్టు నిర్ణయంపై టాలీవుడ్‌లో ఉత్కంఠ
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం , లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా కేసులో చిక్కుముడులను విప్పి, దర్యాప్తును త్వరగా ఫినిష్ చేయాలని ఖాకీలు యోచిస్తున్నారు. ఇదే సమయంలో జానీ మాస్టర్ సైతం కేసులోంచి బయటపడాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తనపై అత్యాచారం చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ జానీ మాస్టర్‌పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా గోవాలోని ఓ లాడ్జిలో తలదాచుకున్న జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

మరోవైపు.. బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత సైతం దాడికి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సుమలతను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. అయితే జానీ మాస్టర్‌ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని సుమలత ఆరోపిస్తున్నారు. ఆయన చాలా మంచివారని, ఎంతో మందికి సాయం చేశారని ఆమె చెబుతున్నారు.
జానీ మాస్టర్ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగి అన్ని రకాలుగా బాధితురాలికి సాయం చేస్తోంది. ఆమెకు ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ బడా ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తోందని ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఆ హీరో ఎవరు, ఆమె వెనుక ఎందుకు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌లపై దుష్ప్రచారం జరగడంతో పుష్ప-2 నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వివరణ ఇచ్చారు. పుష్ప2లో ఐటెం సాంగ్‌కి జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేయాల్సి ఉందని.. కానీ అంతలోనే ఇది జరిగిందన్నారు. జానీ మాస్టర్ కేసులో ఏం జరుగుతోందనే దానిపై అల్లు అర్జున్‌కు ఏమీ తెలియదని రవిశంకర్ చెప్పారు.
జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకుంటు మరిన్ని వివరాలు తెలుస్తాయని ఉద్దేశంతో పోలీసులు సోమవారం ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. మంగళవారం దీనిపై వాదనలు జరగ్గా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. అటు ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న జానీ మాస్టర్ రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో జానీ మాస్టర్ విషయంలో ఏం జరగనుందా అని టాలీవుడ్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











