కాంతార, రిషబ్ శెట్టిపై రణవీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు... కన్నడిగుల ఫైర్
తమ ప్రాంతం, భాష, సంస్కృతి అంటే కన్నడిగులుకు ఎంతో అభిమానం. ఎవరైనా తమ గురించి నోరుజారితే వదిలిపెట్టరు. ఎవరైనా, ఎంతటి వారైనా సరే నిరసన సెగను ఎదుర్కోవాల్సిందే. మహామహులకే ముచ్చెమటలు పట్టించన చరిత్ర కన్నడిగులకు ఉంది. సొంత రాష్ట్రానికే చెందిన రష్మిక మందన్ననే వాళ్లు వదిలిపెట్టలేదంటే వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కన్నడిగుల నుంచి నిరసన ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్. ఈ వివరాల్లోకి వెళితే...
కమల్‌ను వణికించిన కన్నడిగులు
కొద్దిరోజుల క్రితం కమల్ హాసన్ నటించిన థగ్‌లైఫ్ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా తమిళ నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో మండిపడిన కన్నడ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు కమల్ హాసన్‌పై మండిపడ్డాయి. థగ్‌లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి తగినట్లుగానే కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీర్మానం చేయడంతో కమల్ హాసన్ హైకోర్టుకెక్కారు. కోర్టు కూడా కమల్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. క్షమాపణలు చెబితే అయిపోయే దానికి ఇక్కడి వరకు తెచ్చుకున్నారని ఫైర్ అయ్యింది.

తెలుగు చిత్రాలకు నిరసన సెగ
ఇక వేరే ప్రాంతానికి చెందిన భాషల చిత్రాలకు కన్నడ నాట నిరసన సెగ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, గేమ్ ఛేంజర్ తదితర చిత్రాల పేర్లు తెలుగులో లేవంటూ అక్కడి సంఘాలు నానారచ్చ చేశాయి. దీంతో కన్నడ సినిమాలను తెలుగులో బ్యాన్ చేయాలంటూ మన దగ్గరా డిమాండ్స్ వచ్చాయి. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వైఖరిని ఖండించారు.
కన్నడ సినిమాకు గర్వకారణంగా కాంతార
కాగా.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని మరో మెట్టెక్కించిన చిత్రం కాంతార, కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1400 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు.. కాంతార చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డ్ సైతం దక్కింది. తాజాగా గోవాలో జరుగుతున్న గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ కాంతార చిత్రానికి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాని, దర్శకుడు రిషబ్ శెట్టిని అవమానించే విధంగా రణవీర్ సింగ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
కాంతారపై రణవీర్ అనుచిత వ్యాఖ్యలు
తొలుత కాంతార గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన రిషబ్ శెట్టి... ఆ తర్వాతే హేళనగా మాట్లాడారు. ఈ సినిమాలో రిషబ్ శరీరంలోకి పంజుర్లీ దేవత ప్రవేశించిన సమయంలో ఆయన ఓ అంటూ ఓ విచిత్రమైన శబ్ధం చేస్తారు. దీనిని అవహేళన చేసేలా హాస్యాస్పదంగా చేసి చూపించారు రణవీర్. అలాగే రిషబ్ శరీరంలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇవే ఆయనను వివాదంలోకి నెట్టాయి. పంజుర్లీ దేవతను పట్టుకుని దెయ్యమని అంటావా? అంటూ కన్నడిగులు రణవీర్‌పై మండిపడుతున్నారు. తమ రాష్ట్రానికి ఎంతో పేరుని తీసుకొచ్చిన కాంతార చిత్రాన్ని, కన్నడ సంస్కృతిని, దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రణవీర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కన్నడిగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై రణవీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











