‘రష్మిక వల్లే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. అల్లు అర్జున్‌కు అంత సీన్ లేదు’
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మరణించడం.. ఓ అబ్బాయి ఆరోగ్యం ప్రాణాంతకంగా మారడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఐకాన్ స్టార్‌ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించడం, ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల కావడం వివాదంలో భాగంగా మారింది. అయితే ఈ వివాదం సమసిపోయే దశలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పుష్ప 2 సినిమా గురించి, తొక్కిసలాట గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏమిటంటే?
డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రేక్షకులు, అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు. ఈ సందర్భంగా జనాలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జీ నిర్వహించారు. దాంతో అక్కడ పరిస్థితులు మరింత అదుపు తప్పాయనేది ఓ వాదన తెరపైకి వచ్చింది.

అయితే ఇదిలా ఉండగా, 9.30 గంటల ప్రాంతంలో పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా, అలాగే రష్మిక, మదనపల్లి వైసీపీ అభ్యర్థి, ఇంకా చిత్ర యూనిట్ అందరూ సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు రద్దీగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ అక్కడకు వస్తూ.. కారు టాప్ తీసి, అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అందువల్ల పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే తొక్కిసలాట జరిగిందని చిక్కడ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్దకు ఎక్కువ మంది రావడానికి కారణం రష్మిక మందన్న కావొచ్చుగా. ఆమెను చూడటానికే అంత మంది వచ్చి ఉంటారని అనుకోవచ్చుగా. అలా ఎవరు అనుకోలేదు. ఆమెపై కేసు కూడా పెట్టలేదు అని ఆయన అన్నారు.

రష్మిక వల్ల తొక్కిసలాట జరిగిందనే కొత్త వాదనను సమర్ధించుకొంటూ.. ఆమె నేషనల్ క్రష్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూడటానికి బాగుంటాడా? గడ్డం పెంచి.. డీ గ్లామర్‌గా కనిపించాడు. ఆయనను చూడటానికి ఎవరు వస్తారు. రష్మికను చూడటానికే వెళ్లి ఉంటారని అనుకోవచ్చుగా అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











