Khiladi డైరెక్టర్ మీద రవితేజ దారుణమైన సెటైర్లు.. మహార్జాతకుడు అంటూనే?
మాస్ మహారాజ రవి తేజకు, 'ఖిలాడి' దర్శకుడు రమేష్ వర్మకు మధ్య ఏదో జరిగిందని చాన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయం మీద ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ దొరకలేదు కానీ ఇప్పుడు అనుహ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ స్పీచ్ అనేక అనుమానాలకు కారణం అయింది. ఆ వివరాలు..

చర్చనీయాంశంగా
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవి తేజ మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శ్రీకాంత్ విస్సా కోసమే
బుధవారం రాత్రి జరిగిన 'ఖిలాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ 'ఖిలాడి' సినిమా చేయడానికి దర్శకుడు కారణం కాదన్నట్టు ఆయన మాట్లాడారు. రవితేజ దర్శకుడిని అభినందిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరికదా అసలు ఈ సినిమా ఒప్పుకుంది కేవలం రచయిత శ్రీకాంత్ విస్సా కోసమే అని చెప్పుకొచ్చారు. సో రవితేజ, రమేష్ వర్మ మధ్య ఏదో వివాదం జరుగుతోందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఆ ఒక్క విషయంలో థాంక్స్
ముందుగా 'ఖిలాడి' కథా రచయిత శ్రీకాంత్ విస్సాను వేదిక మీదకు రవితేజ పిలిచారు. ''ఇతడు నాకు కథ చెప్పాడు. ఇతను చెప్పాడు కాబట్టే చేశాను. ఈ సినిమా ఒప్పుకున్నాను. 'ఖిలాడి' నేను చేయడానికి మొదటి కారణం ఇతడే'' అనే మాట ఒకటికి రెండుసార్లు రవితేజ చెప్పారు. అలాగే 'ఖిలాడి' సినిమా చేయడానికి ముఖ్య కారణం శ్రీకాంత్ విస్సా అయితే... మరో కారణం నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు అని రవితేజ చెప్పారు. సినిమాలో సన్నివేశాలు, డైలాగులు ఎంజాయ్ చేస్తారంటే అవన్నీ శ్రీకాంత్ విస్సా రాసినవని, అతనితో సినిమాలు చేస్తున్నానని, గొప్ప టాలెంట్ ఉన్న అతడిని పరిచయం చేసినందుకు రమేష్ వర్మకు థాంక్స్ చెప్పాలని అన్నారు. ఆ ఒక్క విషయంలో థాంక్స్ చెప్పుకోవాలని చెప్పుకొచ్చారు.

మహార్జాతకుడు
అలాగే బేసిగ్గా తాను అదృష్టాన్ని నమ్మనని, కష్టాన్ని నమ్ముతానని రవితేజ అన్నారు. కానీ, రమేష్ వర్మను చూస్తే అదృష్టాన్ని నమ్మే శాతం కొంచెం పెంచాలని ఉందని చిన్న సెటైర్ వేశారు. అతడు మహార్జాతకుడు అని అది కూడా రమేష్ వర్మ అదృష్టం, జాతకం పేరు కోనేరు సత్యనారాయణ అని... సినిమా విడుదలకు ముందు ఆయన దగ్గర నుంచి రమేష్ వర్మ కారు కొట్టేశారని రవితేజ అనడం అనేక చర్చలకు దారి తీస్తోంది. అయితే సహ నిర్మాతగా రమేష్ వర్మ దగ్గరుండి ప్రొడక్షన్ చూసుకున్నారని కోనేరు సత్యనారాయణ అన్నారు.
Recommended Video

ఏదో తేడా వచ్చి
అయితే ఆ తర్వాత స్పీచ్ తర్వాత మళ్లీ రవితేజ ఆయనను సెట్స్ దగ్గరకు రావాలని కోరారు. వస్తే చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేద్దామని రవితేజ అంటే... ఫిబ్రవరి 11న విడుదల చేయాలని రమేష్ వర్మ పట్టుబట్టారని, షూటింగులో కూడా ఇద్దరి మధ్య ఏదో తేడా వచ్చిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమే అని రవితేజ తన మాటలతో తేల్చేశారు.


Click it and Unblock the Notifications











