మాస్ మహారాజ్ లైన్ క్లియర్.. 'డిస్కొరాజా' సెన్సార్ పూర్తి
సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు 'డిస్కొరాజా' అయ్యాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడకపోవడంతో ఈ సారి వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ మేరకు వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కొరాజా' సినిమా పూర్తిచేసి రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యాడు. ఈ దూకుడును స్వాగతిస్తూ మాస్ మహారాజ్‌కి లైన్ క్లియర్ చేసింది సెన్సార్ బోర్డు.
తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'డిస్కొరాజా' U\A సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు రవితేజ నటనకు మంచిమార్కులు వేసినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ రవితేజ అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. మాస్ మహారాజ్ నుంచి కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా హింట్ ఇచ్చేశాయి. దీంతో 'డిస్కొరాజా'పై ఇప్పటికే ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం మరో ఆకర్షణీయమైన అంశం. అందాల భామలు నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్‌లు అందాల విందియ్యనున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
థమన్ బాణీలు కట్టిన ఈ సినిమా జనవరి 24వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











