సంక్రాంతికి రవితేజ మరో సర్‌ప్రైజ్: టాలీవుడ్‌లో ఎవరూ చేయని విధంగా ప్లాన్ చేసిన హీరో
గత ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్' మూవీలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి'ని చాలా రోజుల క్రితమే మొదలు పెట్టాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఫిబ్రవరి 11కు వాయిదా పడింది.
'ఖిలాడీ' మూవీ షూటింగ్ జరుగుతుండగానే శరత్ మందవ అనే దర్శకుడితో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే ఏడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ రెండు మాత్రమే కాదు.. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన త్రినాథరావు నక్కినతో రవితేజ ఇటీవలే సినిమాను ప్రకటించాడు. దీనికి 'ధమాకా' అనే టైటిల్ పెట్టారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇందులో నటించే నటీనటుల వివరాలు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. అయితే, 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగానే రవితేజ మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో యమ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలను లైన్‌లో పెట్టుకున్న అతడు.. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో 'రావణాసుర' అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఇక, ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆరోజు ఉదయం 9:50 గంటలకు జరపనున్నారు. దీనికి అందరినీ ఆహ్వానిస్తూ మూవీ యూనిట్ ఓ ప్రకటనను కూడా వదిలింది.
పూర్తి స్థాయి విభిన్నమైన కథతో రాబోతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ విభిన్నమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ తెలియజేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











