శృతి హాసన్‌తో చిందులేసేందుకు గోవా వెళ్లిన మాస్ మహారాజా
కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో 'రాజా ది గ్రేట్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో తనకు 'డాన్ శీను', 'బలుపు' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరోసారి జత కట్టాడీ సీనియర్ హీరో.
ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న చిత్రం 'క్రాక్'. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆలస్యం అయిన ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అందుకు అనుగుణంగానే మిగిలిన చిత్రీకరణను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కొన్ని పాటల చిత్రీకరణ కోసం రవితేజ అండ్ కో గోవా పయనం అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'క్రాక్ చివరి షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నాం' అని ఓ ఫోటోను సైతం పోస్ట్ చేశారు. దీని కోసం శృతి హాసన్ కూడా అక్కడకు వెళ్లి చిత్ర యూనిట్‌ను కలుస్తుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో తమిళ పరిశ్రమకు చెందిన వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











