నా కోడలు నన్ను అక్కడికి తీసుకెళ్లింది .. రోజా రహస్యాలు బయటపెట్టిన అత్తగారు
ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రోజా. హేమాహేమీలు ఉన్న ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతోనే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. సౌత్‌లోని అందరు స్టార్ హీరోలతో నటించి శెభాష్ అనిపించుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడి ఆయనతో సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. సినిమాలలో నటిస్తున్నా రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి ఉండటంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తదితర టీడీపీ పెద్దల ప్రోత్సాహంతో తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. అయితే నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్‌లో పరిస్థితుల దృష్ట్యా ఆమె తన ఆలోచన విరమించుకున్నారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు.

ఫైర్‌బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరైన రోజా... దూకుడుగా ఉంటారు. ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయడంలో రోజా స్టైల్ డిఫరెంట్. 2014లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో జగన్ ఆదేశాల మేరకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో నగరి నుంచి మరోసారి విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను కీలకమైన ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు పర్యాటక, యువజన వ్యవహారాల శాఖను అప్పగించారు జగన్. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రోజా రాజకీయాలకు గుడ్ బై చెబుతారని అంతా భావించారు. మరికొందరైతే ఆమె కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్టాపించిన పార్టీలో చేరి తమిళ రాజకీయాల్లో అడుగుపెడతారని వార్తలు వచ్చాయి. అయితే రోజా స్వయంగా దీనికి తెరదించడంతో పుకార్లకు చెక్ పడింది.
ఇదిలాఉండగా.. మాజీ మంత్రి రోజా గురించి ఆమె అత్తగారు ఆర్కే సెల్వమణి తల్లిగారు కీలక వ్యాఖ్యలు చేశారు. రోజాను తాను ఏనాడూ కోడలిగా చూడలేదని.. కూతురిగా చూశానని , ఆమెతో ఫ్రెండ్ మాదిరిగా ఉంటానని అన్నారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి నన్ను కూడా తీసుకెళ్తుందని , షాపింగ్‌కి కూడా ఇద్దరం కలిసే వెళ్లే వాళ్లమని ఆమె చెప్పారు. తాను నలుపు రంగును బాగా ఇష్టపడతానని.. దీంతో తనకు బ్లాక్ కలర్‌లోని చీరలు, ఇతర వస్తువులు తీసుకొచ్చి ఇస్తుందని తెలిపారు. నా ఇంటికి వస్తే ఆమెకు ఏమీ ఇష్టమో అది చేసి పెడతానని అన్నారు. రోజా గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయని.. రాజకీయాలు, షూటింగ్‌లతో ఆమె బిజీగా ఉంటారని ఆమె కష్టం చూస్తే నాకే పాపం అనిపిస్తుందని రోజా అత్త గారు కోడలిపై ప్రశంసల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











