‘లూసీఫర్’ రీమేక్ నుంచి షాకింగ్ అప్‌డేట్: అక్కడ లేకపోయినా.. చిరంజీవి కోసమే కొత్తగా!
సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఆయన వేగం పెంచేశారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్‌కు కూడా ఇటీవల కొబ్బరి కాయ కొట్టేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. దీన్ని చిరంజీవి హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లపై రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారం నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇందులో ప్రియమణి, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఇక, ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చబోతున్నట్లు దర్శకుడు మోహన్ రాజా ఇటీవలే వెల్లడించారు. మెయిన్ కథను మాత్రం తీసుకుని చాలా మార్పులు చేశామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేశారట. అంతేకాదు, హీరో హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. మాతృకలో అసలు హీరోయిన్ పాత్రే లేకపోయినా.. చిరంజీవి కోసం ఈ మార్పును చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











