యాక్షన్ బిగిన్... ‘సాహో’ టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది!
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ 'సాహో'. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా జూన్ 13న టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జూన్ 14 నుంచి ఈ టీజర్ థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'సాహో' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తోంది. బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. 'షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో చాప్టర్ 1, చాప్టర్ 2 మేకింగ్ వీడియోలు విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కించారు. టెక్నికల్ అంశాల పరంగా, విజువల్స్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతోందని, భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంకా నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











