నేను బతికి ఉన్నానంటే కారణం అదే.. మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రస్తుతం తనదైన శైలిలో విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోగా కొనసాగుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు కంటెంట్ ఆధారిత సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే.. తాజాగా ఓ వేదికపై సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ.. నేను బతికి ఉన్నానంటే కారణం అదే అంటూ మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఇటీవల తన పేరుకు ముందు తల్లి పేరును జోడించుకుని సాయి దుర్గ తేజ్‌గా మారిన విషయం తెలిసిందే. కుటుంబ విలువలకు, తల్లిపట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో అభిమానులు ప్రశంసించారు. రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ మెగా హీరో, మళ్లీ తిరిగి వచ్చి వరుసగా విజయాలను అందుకున్నాడు. విరూపాక్ష, బ్రో వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లు నమోదు చేశాడు. ప్రమాదం తర్వాత మానసికంగా, శారీరకంగా కోలుకుని తిరిగి కెమెరా ముందు నిలబడటం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.

ధనుష్ హీరోగా, విష్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కర (Kara) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళంలో హైస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగులో కూడా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ ముందుగా ధనుష్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అభిమానులతో మాట్లాడిన ఆయన, తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రెండు విషయాలను పంచుకోవాలని అన్నారు. ఇదే సమయంలో సభలో కొందరు అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగా, "ఆయనకేం అవుతుంది అయ్యా... మీలాంటి అభిమానులు ఉంటే ఆయన ఎప్పుడూ సూపర్‌గానే ఉంటారు" అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. "బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే ఆ రోజు ప్రమాదం జరిగినా నేను ఈరోజు మీ ముందున్నాను. నేను బతికి ఉన్నానంటే కారణం అదే" అంటూ ఎమోషనల్‌గా చెప్పారు. ఆయన మాటలు వినగానే సభలో ఉన్నవారు చప్పట్లతో స్పందించారు. అభిమానులు కూడా ఈ సందేశాన్ని ప్రశంసించారు.
ఇక రెండో విషయంగా మహిళల గౌరవంపై ఆయన మాట్లాడారు. "ఎవరైనా ఆడవాళ్లు కనిపిస్తే మీ అమ్మగారికి ఎలా గౌరవం ఇస్తారో, అలానే ప్రతి ఆడపిల్లకు మర్యాద ఇవ్వండి. దయచేసి ఇది గుర్తుంచుకోండి" అంటూ తన అభిమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. హీరోగా మాత్రమే కాకుండా బాధ్యతగల వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ చెప్పిన ఈ సందేశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ జీవితాన్ని మార్చేసిన ఆ ప్రమాదం 2021 సెప్టెంబర్ 10న జరిగింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో తన స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మెడ ఎముక విరగడం, సాఫ్ట్ టిష్యూ దెబ్బతినడం వంటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే హెల్మెట్ ధరించి ఉండటమే ఆయన ప్రాణాలను కాపాడిందని వైద్యులు అప్పట్లో వెల్లడించారు. అందుకే ఇప్పుడు ప్రతి యువకుడికి హెల్మెట్ తప్పనిసరి అని ఆయన పదేపదే చెబుతున్నారు.
ఆ ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తేజ్, పూర్తిగా కోలుకుని మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టారు. తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం కష్టపడి తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి బలంగా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంబరాల యేటి గట్టు ( Sambarala Yeti Gattu) సినిమాలో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో రోహిత్ పీకే (Rohith KP) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాతగా నిరంజన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నారట. లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో ఆయనను చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, "నేను బతికి ఉన్నానంటే కారణం అదే" అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను తాకాయి.


Click it and Unblock the Notifications