సుకుమార్ బ్యానర్‌లో సాయి ధరమ్ తేజ్.. కొత్త సినిమాను ప్రారంభించిన సుప్రీమ్ హీరో
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. రేపు (డిసెంబర్ 25) కొత్త సినిమా విడుదల కాబోతోంది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ తన అదృష్టాన్ని, సినీ భవిష్యత్తును, థియేటర్ల ఆదరణను పరీక్షించుకోబోతోన్నాడు. పాండమిక్ సమయంలో ఇలా థియేటర్లోకి వస్తోన్న మొదటి చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక వైపు టాలీవుడ్ అంతా కూడా సోలో బ్రతుకే సో బెటర్‌ను ప్రమోట్ చేసే పనిలో పడింది.
హీరోలందరూ సాయి ధరమ్ తేజ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మళ్లీ థియేటర్లలో పండుగ వాతావరణాన్ని చూడాలంటూ హీరోలందరూ కోరుకుంటున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా ఇతర హీరోలందరూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను భుజాన మోశారు. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మొదలెట్టేసి లాంఛనంగా సినిమాను ప్రారంభించేశాడు.

సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆ మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జాతకలు, మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మూవీకి సుకుమార్ కథనాన్ని అందించనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











