Gargi Trailer: మరోసారి ఎమోషనల్ గా టచ్ చేస్తున్న సాయి పల్లవి.. తండ్రి కోసం పోరాటం!
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక బలమైన కొత్త పాయింట్ ఉంటుంది అని జనాల్లో ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడింది. బాక్సాఫీస్ తో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళుతున్న సాయి పల్లవి మరోసారి గార్గి అనే సినిమాతో ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విరాటపర్వం సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా సాయి పల్లవి అదే తరహాలో ముందుకు సాగుతోంది అని చెప్పాలి. ఇక గార్గి సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల మూడు భాషల్లో విడుదల చేశారు.
ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి ఒక స్కూల్ టీచర్ గా కనిపించబోతోంది. ఆమె తండ్రి ఒక సంఘటన ఆధారంగా ఊహించని విధంగా కేసులో ఇరుక్కోవడంతో అతని కోసం ఆమె ఎలాంటి అనుభవాలని ఎదుర్కొంది ఆ చేదు అనుభవాలను దాటి తన తండ్రిని కాపాడుకుందా లేదా అనే విషయాన్ని ట్రైలర్లో చాలా ఆసక్తికరంగా చూపించారు.

గతంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన సాయి పల్లవి ఈ సినిమాల్లో మాత్రం తండ్రి మీద ఎంతో ప్రేమ ఉన్న అమ్మాయిగా కనిపిస్తోంది. అంతేకాకుండా సమాజంలో ఒక ఆడపిల్ల పై తల్లిదండ్రులు చూపిస్తున్న అసమానత్వాన్ని కూడా ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు ఒక డైలాగ్ లోనే చూపించేశారు. తోడుగా గుర్తింపు లేని ఒక లాయర్ కూడా తోడవడం ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో సాయి పల్లవి తన తండ్రిని జైలు నుంచి ఎలా తప్పించింది అనేది కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతోంది.
చూస్తుంటే ఒక ఎమోషనల్ లాజికల్ డ్రామాగా గార్గి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి మంచి నటిగా మరోసారి తన టాలెంట్ ని చూపించబోతొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ పై రానా రిలీజ్ చేస్తుండగా తమిళంలో సూర్య విడుదల చేస్తున్నారు. ఇక కన్నడలో రక్షిత్ శెట్టి సమర్పకుడిగా ఉన్నాడు. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక గార్గి సినిమా ఫైనల్ గా జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











