జాను రిలీజ్ డేట్ ఫిక్స్.. సందడి చేసేందుకు సమంత రెడీ
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత మరో సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయింది. గతేడాది వరుస సక్సెస్‌లు అందుకున్న ఈ యంగ్ హీరోయిన్ 'ఓ బేబీ' సినిమా తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. దీంతో ఆమె సినిమా కోసం టాలీవుడ్ లోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అయితే ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ సమంత కొత్త సినిమా 'జాను' రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
వైవిధ్యభరితమైన కథా చిత్రంగా తమిళంలో విడుదలై సక్సెస్ సాధించిన '96' సినిమాను తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీపడి మరీ ఆ హక్కులను దక్కించుకున్న దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా జాను పాత్రలో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. ముందుగా ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ తేదీ మార్చేస్తూ ఓ వారం ముందుగానే ఫిబ్రవరి 7న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఇప్పటికే విడుదలైన జాను పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. చిత్రంలో రెండో పాట ''ఓహోలే'' ఈ రోజు (జనవరి 26) విడుదల కానుంది. కథాపరంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి సూపర్ హిట్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











