Samantha: అక్కినేని ఫ్యామిలీకి అండగా సమంత.. డైవోర్స్ తర్వాత అన్ని మరిచిపోయి!
అక్కినేని నాగచైతన్య - సమంతల విడాకుల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఏళ్లు గడుస్తున్నా ఈ ఇష్యూని అక్కినేని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. విడాకుల తర్వాత ఎవరి జీవితాలు వారివి అయిపోయాయి. నాగచైతన్య.. శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకోగా.. సమంత.. ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడారు. అక్కినేని ఫ్యామిలీతో సమంతకు సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయ్యాయి. అయితే ఆ ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరితో ఆమె ఇప్పటికీ క్లోజ్‌గా ఉందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో విడాకులు జరిగిన ఇన్నేళ్ల తర్వాత సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఏమాయ చేశావే సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నాగచైతన్య - సమంతలు కొన్నేళ్లపాటు డేటింగ్ చేసి అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వీరి కాపురం సజావుగా సాగింది. నిత్యం సోషల్ మీడియాలో నాగచైతన్యతో గడిపిన క్షణాలను సమంత పోస్ట్ చేసేవారు. కరోనా సమయంలో తన ఫ్లాట్‌లోనే మొక్కలు పెంచి .. ఆరోగ్యంగా ఎలా ఉండాలి? వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలో చెబుతూ వీరిద్దరూ వీడియోలు పెట్టేవారు.

అయితే అనూహ్యంగా సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించారు. అలాగే నాగచైతన్యతో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు బయల్దేరాయి. వీటిని నిజం చేస్తూ కొద్దిరోజులకు సమంత- నాగచైతన్య పరస్పర అంగీకారంతో విడిపోయారు. తెలుగునాట స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అర్ధాంతరగా విడిపోవడం అక్కినేని అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది. చివరికి చైతూపై ప్రేమతో వేయించుకున్న టాటూను కూడా చెరిపేసింది.
నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌పై ఏనాడూ ఎలాంటి మాటలు మాట్లాడలేదు సమంత. వారందరీ సోషల్ మీడియా ఖాతాలను నేటికీ ఫాలో అవుతున్నారు సామ్. తాజాగా తన మామగారు అక్కినేని నాగార్జున మేనకోడలు.. సుప్రియ యార్లగడ్డపై తన అభిమానాన్ని చాటుకున్నారు సామ్. సుప్రియ నిర్మాణంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా షానీయల్ డియో దర్శకత్వంతో డెకాయిట్ మూవీని తెరకెక్కించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
నిర్మాతగా సుప్రియ తన అభిరుచికి తగినట్లుగా సినిమాలు తెరకెక్కిస్తూనే.. అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటూ మేనమామ బాటలోనే సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ఉమెన్ అనిపించుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు. తక్కువగా మాట్లాడుతూ.. తన పని తాను చేసుకుపోయే సుప్రియకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. తాజాగా డెకాయిట్ కోసం సుప్రియ యార్లగడ్డ ఎంతో శ్రమించారు. ఈ నేపథ్యంలో డెకాయిట్ రిలీజ్ సందర్భంగా సుప్రియకు సమంత బెస్ట్ విషెస్ తెలియజేశారు.
డెకాయిట్ కోసం నువ్వు పడిన కష్టం.. నీ కృషి, పట్టుదల, సినిమాపై నీకున్న డెడికేషన్ నేను స్వయంగా చూశా. బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడానికి నువ్వు అర్హురాలివి. గాడ్ బ్లెస్ యూ అంటూ సుప్రియ యార్లగడ్డ కోసం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. విడాకుల తర్వాత అన్ని మరిచిపోయి కూడా అక్కినేని ఫ్యామిలీకి సమంత అండగా నిలిచారంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications

















