Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ట్విస్ట్.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన పోలీసులు
ఏడాది క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వివాహిత మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కొన్నిరోజుల పాటు మృత్యువుతో పోరాడి కోలుకున్నాడు.
తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. తొక్కిసలాట చోటు చేసుకుని ఏడాది కావొస్తున్నప్పటికీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ మూవీని 2024 డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. అలాగే సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి. దీనిలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో ఏర్పాటు చేశారు. తన సినిమాను అభిమానులతో కలిసి చూడాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్.. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పటికే భారీగా అభిమానులు పోటెత్తడంతో థియేటర్ ప్రాంగణం, బయట రహదారి కిక్కిరిసిపోయింది.
ఆ సమయంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయి జనం కాళ్ల కింద నలిగిపోయారు. వారిని గమనించిన పోలీసులు పక్కకి లాగి ఇద్దరికీ సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మరణించగా.. శ్రీతేజ్ పరిస్ధితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. వీరితో పాటు ఈ తొక్కిసలాట ఘటనలో పలువురు అభిమానులు గాయపడ్డారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం యాక్షన్‌లోకి దిగింది. పలువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ విడుదలయ్యారు. అయితే చట్టపరమైన ప్రక్రియ కారణంగా ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. అయితే తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప యూనిట్ అండగా నిలిచింది. అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల రూపాయలు, సుకుమార్ మరో 50 లక్షల రూపాయలు కలిపి మొత్తం 2 కోట్ల రూపాయలను రేవతి కుటుంబానికి అందించారు.
తాజాగా తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 27వ తేదీన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేశారు. అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు తేల్చారు. ఏ 1గా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని చేర్చగా.. ఏ 11గా హీరో అల్లు అర్జున్‌ని చేర్చారు. అలాగే ముగ్గురు మేనేజర్లు, 8 మంది బౌన్సర్లు, మరో నలుగురిని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుండగా.. దీనిపై పుష్ప 2 యూనిట్, హీరో అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











