Sankranthi 2026 Movies: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. బాక్సాఫీస్‌లో నెగ్గేదెవరో?
Sankranthi 2026 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు... బాక్సాఫీస్ యుద్ధం కూడా.. ప్రతి ఏడాదిలాగే 2026 సంక్రాంతికీ థియేటర్లు కళకళలాడబోతున్నాయి. కానీ, ఈసారి పోటీ మరింత హై లెవెల్‌లో ఉండబోతోంది. సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకూ... పైగా డబ్బింగ్ చిత్రాల దూకుడు కూడా ఉండటంతో సంక్రాంతి 2026 బాక్సాఫీస్ ఫైట్ హాట్ టాపిక్‌గా మారింది. మరి ఏ సినిమా ఏ తేదీన రిలీజ్ అవుతోంది? ఎవరి మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి? ఏ హీరో బరిలో నిలుస్తున్నాడు? అన్నదానిపై ఓ లూక్కేయండి..
ఈ సంక్రాంతికి ఇప్పటివరకూ కన్ఫర్మ్ అయిన సినిమాల సంఖ్య చూస్తే ఆశ్చర్యంగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కలిపి ఏకంగా 7 సినిమాలు బాక్సాఫీస్ రేస్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నింటికీ ఓటీటీ (OTT) డీల్స్ ముందే ఫిక్స్ కావడం విశేషం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ థియేటర్లలో రిలీజ్ కావాల్సిందే. దీంతో మేకర్స్ అంతా ప్రమోషన్లపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో ..

రాజా సాబ్
సంక్రాంతి రేస్‌ను స్టార్ట్ చేయబోతున్న సినిమా 'ది రాజా సాబ్'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జనవరి 9, 2026న విడుదల కానుంది. జనవరి 8న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ కొత్త జానర్‌లో కనిపించనుండటమే పెద్ద హైలైట్. కామెడీ, హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
జన నాయకుడు
జనవరి 9న మరో భారీ డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. అదే దళపతి విజయ్ నటించిన 'జన నాయకుడు'. రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లనున్న విజయ్, ఇదే తన లాస్ట్ సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. అందుకే ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఒకే రోజున ప్రభాస్ 'రాజా సాబ్'తో పాటు విజయ్ 'జన నాయకుడు' రిలీజ్ కావడంతో... బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే గట్టి పోటీ తప్పదనే చెప్పాలి.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే సంక్రాంతి బాక్సాఫీస్ రేంజ్ మారిపోతుంది. 2026 సంక్రాంతికీ చిరు రంగంలోకి దిగుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా జనవరి 12న విడుదల కానుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి కామెడీ టైమింగ్ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
వరుసగా యాక్షన్ సినిమాలతో ప్లాఫ్‌లు ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందింది. ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన రావడంతో రవితేజ ఫ్యాన్స్‌కు ఈ సినిమా మీద ఆశలు పెరిగాయి.
అనగనగా ఒక రాజు: నవీన్ పోలిశెట్టి హీరోగా, కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అనగనగా ఒక రాజు' కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. నవీన్ కామెడీ టైమింగ్, స్క్రిప్ట్ బలం ఈ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది.
నారి నారి నడుమ మురారి: శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన 'నారి నారి నడుమ మురారి' కూడా అదే రోజు విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది.
ఎవరి మీద ఎక్కువ హైప్?
మొత్తంగా చూస్తే సంక్రాంతి 2026 బాక్సాఫీస్ వద్ద నిజమైన పండగ వాతావరణం నెలకొనబోతోంది. హైప్ పరంగా చూస్తే ప్రభాస్ 'రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలు ముందున్నాయి. అయితే కంటెంట్ బలంగా ఉంటే నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. అన్ని సినిమాలు అనుకున్న తేదీలకే వస్తాయా? లేక చివరి నిమిషంలో వాయిదాలు ఉంటాయా? అన్నది ఇంకా చూడాలి. కానీ ఒక్కటి మాత్రం ఖాయం..సంక్రాంతి 2026 తెలుగు సినీ లవర్స్‌కు ఫుల్ మీల్స్ పండగగా మారబోతోందని చెప్పాలి.


Click it and Unblock the Notifications











