ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు.. మురుగదాస్!
సర్కార్ చిత్ర విషయంలో మురుగదాస్ ఇప్పటికి చిక్కులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇళయదళపతి విజయ్ తో మురుగదాస్ రూపొందించిన ఈ హ్యాట్రిక్ చిత్రం ఘన విజయం సాధించింది. అదే స్థాయిలో వివాదాలని కూడా సృష్టించింది. ఈ చిత్రంలో అధికార అన్నా డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పెద్ద రచ్చ జరిగింది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన వస్తువులని మంటల్లో తగలబెట్టే సన్నివేశాలపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు చెన్నైలో మురుగదాస్ పై కేసు నమోదు చేశారు. దీనితో తనపై బనాయించిన కేసుని రద్దు చేయాలని మురుగదాస్ కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసు విచారణని కోర్టు డిసెంబర్ 20కి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని విమర్శించడం తప్పు కాదని మురుగదాస్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

సర్కార్ చిత్రం సెన్సార్ సభ్యుల ఆమోదం పొందిన తరువాతే విడుదలైందనే విషయాన్ని మురుగదాస్ గుర్తు చేశారు. ఈ చిత్రంలో అన్నా డీఎంకే ప్రజలకు ఇచ్చిన వివిధ వస్తువులని కాల్చివేస్తూ చూపించారని కేసు నమోదు చేసిన దేవరాజ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. ఈ కేసునుంచి మురుగదాస్ కు ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో చూడాలి. మురుగదాస్ ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











