Sarkaru Vaari Paata: మహేశ్ ఖాతాలో మరో ఘనత.. చిరంజీవి, పవన్ రికార్డులు బద్దలు
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పేరుకు దిగ్గజ నటుడి వారసుడే అయినా.. ప్రతి విభాగంలోనూ తనదైన శైలిని చూపిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు. అలాగే, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా మహేశ్ గణనీయంగా పెంచుకున్నాడు. ఇలా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుస సక్సెస్‌లతో మాంచి ఊపు మీదున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. క్లాస్, మాస్ చిత్రాల దర్శకుడు పరశురాం పెట్లతో రూపొందించిన ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని ప్రచారం జరుగుతోంది. దీన్ని అంచనాలకు అనుగుణంగానే దీన్ని పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించారు. అలాగే, ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్లు అన్నీ వాటిని రెట్టింపు చేసేలానే ఉన్నాయి. ఫలితంగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన థియేట్రికల్ హక్కులన్నీ రికార్డు ధరలకు అమ్ముడు పోయాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ అన్ని హంగులనూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. దీన్ని మే 12 (గురువారం) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు ఉన్న అన్ని ఏరియాల్లోనూ మహేశ్ బాబు మేనియా కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను పండుగలా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 'సర్కారు వారి పాట' విడుదల అవుతోన్న అన్ని థియేటర్లనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఈ మూవీ పేరు మారుమ్రోగుతూనే ఉంది.
మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీ థియేటర్ల సంఖ్య వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఇది నైజాంలో 380, సీడెడ్‌లో 250, ఆంధ్రాలో 540 వరకూ అంటే మొత్తంగా 1200 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 220, ఓవర్సీస్‌లో 700 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2150 థియేటర్లకు పైగానే రిలీజ్ అవుతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రాల జాబితాలో ఇది 14వ స్థానానికి చేరుకుంది. తద్వారా 2000 థియేటర్లలో విడుదలైన చిరంజీవి 'ఆచార్య', పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' రికార్డులను ఇది బద్దలు కొట్టింది.
'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











