‘సర్కారు వారి పాట’ నుంచి క్రేజీ అప్‌డేట్: వరుసగా రెండు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అతడు నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'సర్కారు వారి పాట'.. జనవరి మూడో వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరపబోతున్నారని, ఇందులో మహేశ్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ సీన్లను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీని తర్వాత వెంటనే అమెరికాకు పయనం అవుతుందట చిత్ర యూనిట్. చికాగోలో జరపబోయే రెండో షెడ్యూల్‌లో మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. అక్కడి కాసీనో సెంటర్లలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారని వినికిడి.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా... అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ మధ్య మొదలెట్టాలనుకున్నా కరోనా వైరస్ ప్రభావంతో రద్దయింది. దీంతో ఈ సారి షూటింగ్ మొదలైతే నిరంతరాయంగా చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్లిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











