శేఖర్ కమ్ములకు పితృవియోగం.. కుటుంబంలో తీవ్ర విషాదం
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. ఆయన తండ్రి శేషయ్య కమ్ముల శనివారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన తీవ్ర విషాదంలోకి జారుకొన్నారు. పితృ వియోగంతో బాధపడుతున్న శేఖర్ కమ్ములకు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దికాలంగా ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6 గంటలకు మరణించారు అని సన్నిహితులు తెలిపారు. ఆయన వయసు 89 సంవత్సరాలు.

శేఖర్ కమ్ముల తండ్రి అంత్యక్రియలను శనివారం సాయంత్రం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం బన్సీలాల్ పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.
కాగా, ఫిదా సినిమా తర్వాత ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించే ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











