‘‘ నాగార్జునను అరెస్ట్ చేయాలి .. డబ్బు కోసం ఇంత నీచమా , జనమే తరిమి కొడతారు ’’
దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. గౌతమ్- నిఖిల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో నిఖిల్‌నే విజయం వరించి ఈ సీజన్ విజేతగా రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, కారును సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగోడికి అన్యాయం జరిగిందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు. అంతేకాదు... హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్న వందలాది మంది అభిమానులు నిఖిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోలేదు.
ఇదిలాఉండగా.. ప్రతిసారి బిగ్‌బాస్ సీజన్ మొదలైనప్పుడల్లా ఈ షోను రద్దు చేయాలంటూ పలువురు సాంప్రదాయవాదులు గోల గోల చేసేవారు, ఏకంగా కోర్టులను సైతం ఆశ్రయించేవారు. దీనికి కారణాలు లేకపోలేదు.. కంటెస్టెంట్స్ శృతి మించి ప్రవర్తిస్తుండటం, పెళ్లి కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఒకే గదితో , ఒకే బెడ్‌పై రోజుల తరబడి ఉండటం , రొమాన్స్ వంటివి సమాజంపై దుష్ప్రాభావాలు చూపిస్తుందని చిన్నారులను చెడగొట్టినట్లు అవుతుందని వారు వాదిస్తున్నారు.

ఇక సీపీఐ నారాయణ వంటి వారైతే బిగ్‌బాస్‌ను బహిరంగంగానే విమర్శించేవారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ లాంటిదని, దానిని బ్యాన్ చేయాలని.. సెలబ్రెటీ అయ్యుండి ఇలాంటి షోను హోస్ట్ చేస్తున్న నాగార్జునను కటకటాల వెనక్కి నెట్టాలని సీపీఐ నారాయణ మండిపడేవారు. ఈ షో దేశానికి చీడపురుగులాంటిదని, యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన భగ్గుమన్నారు. బిగ్‌బాస్ షోపై నిషేధం విధించాల్సిన అవసరం కళాకారులపై ఉందని నారాయణ తెలిపారు.
తాజాగా సీనియర్ నిర్మాత చిట్టిబాబు బిగ్‌బాస్ , హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. సీపీఐ నారాయణకు మద్ధతు తెలిపిన చిట్టిబాబు.. నాలుగు గోడల మధ్య జరిగే రొమాన్స్‌ను పబ్లిక్‌గా చూపించడం అంటే అది బూతే అవుతుందని వ్యాఖ్యానించారు. హౌస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే బెడ్‌పై పడుకుంటున్నారని.. ముద్దులు పెట్టుకుంటున్నారని, కౌగిలించుకుంటున్నారని చిట్టిబాబు మండిపడ్డారు. పబ్లిక్‌గా ఇలాంటి పనులు బుద్ధిలేని పనులేనని.. నాగార్జున లాంటి వ్యక్తి వీటిని ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబు ఫైర్ అయ్యారు.
చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులు సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోషన్ చేయలేదని, ఒకవేళ ప్రమోషన్ చేసినా తర్వాత మానేశారని చిట్టిబాబు గుర్తుచేశారు. ముందు నాగార్జునని జైల్లో పెట్టాలని.. డబ్బు కోసం ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపడ్డారు. ఇలాగే కంటిన్యూ చేస్తే రేపు జనం స్టూడియో మీదకి వచ్చి సెట్స్ ధ్వంసం చేసి తరిమి తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు . ప్రస్తుతం చిట్టిబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











