యంగ్ హీరోతో షాలిని పాండే రొమాన్స్!
గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది అలా జరగకూడదని దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 చిత్రం ఘనవిజయం సాధించడంతో దిల్ రాజు శుభారంభం చేశారు. సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన మహర్షి విడుదలకు సిద్ధం అవుతోంది. భారీభారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. దిల్ రాజు తక్కువ బడ్జెట్ లో చిత్రాలు నిర్మించి విజయాలు అందుకోవడంలో కూడా దిట్ట. యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో మంచి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కానీ ఇటీవల రాజ్ తరుణ్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. ' ఇద్దరి లోకం ఒకటే' అనేది ఈ చిత్ర టైటిల్. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జీఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కి జోడిగా షాలిని పాండేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

షాలిని పాండే అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని పాండే ఘాటైన రొమాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 చిత్రంతో షాలినికి ఓ విజయం దక్కింది. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో నటించే అవకావం రావడం విశేషం.


Click it and Unblock the Notifications











