భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రభాస్.. అసలు వాస్తవం ఇదీ!
ఇండియాలో భారీ చిత్రాల దర్శకుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రముఖ దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వంలోనే భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ మూవీ 2.0 రూపొందింది. ఈ స్టార్ డైరెక్టర్ త్వరలో బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
దీనిపై శంకర్ సన్నిహితులు స్పందించారు. ప్రభాస్‌తో ఆయన సినిమా చేస్తున్నాడనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ప్రస్తుతం శంకర్ తన తాజా చిత్రం 'ఇండియన్ 2'కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. సినిమా చేసే విషయంలో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదని, ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలియదన్నారు.

'ఇండియన్ 2' సినిమా పూర్తయ్యే వరకు ఇంకా చాలా సమయం పడుతుందని, వచ్చే ఏడాది కూడా శంకర్ దాదాపుగా ఇదే ప్రాజెక్టుపై గడుపుతారని తెలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన 'ఇండియన్' చిత్రానికి ఇది సీక్వెల్.
యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీతో పాటు ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











