శర్వానంద్ హీరోగా మరో సినిమా మొదలైంది, టైటిల్ ఏమిటంటే..
హీరో శర్వానంద్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకెళుతున్నాడు. గతేడాది 'పడి పడి లేచె మనసు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత ఒకదాని వెనక మరొక సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం శర్వానంద్ 'రణరంగం' మూవీతో పాటు '96' తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. తాజాగా శర్వానంద్ హీరోగా 'శ్రీకారం' అనే సినిమా మొదలైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఎన్ఆర్ఐ శశికాంత్ వల్లూరి కెమరా స్విచాన్ చేశారు. ప్రముఖ రచయిత సాయి మాధవ బుర్ర చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు.
'శ్రీకారం' మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనుండగా, యువరాజ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారట.
'96' రీమేక్ షూటింగులో భాగంగా స్కైడైవింగ్ చేస్తుండగా శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి భుజానికి తీవ్రగాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ప్రస్తుతం షూటింగుల్లో పాల్గొనడం లేదు.


Click it and Unblock the Notifications











