Kushi: బడా సంస్థకు విజయ్ దేవరకొండ సినిమా.. రికార్డు ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్
ఆరంభంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టినా.. ఈ మధ్య కాలంలో ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మరీ ముఖ్యంగా తన గత చిత్రం 'లైగర్'తో అతడు భారీ డిజాస్టర్‌ను చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం విజయ్ ప్రస్తుతం 'ఖుషి' అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చేస్తున్నాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎన్నో అవాంతరాల నడుమ ఇటీవలే కంప్లీట్ అయింది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతోంది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పాటలను కూడా విడుదల చేసింది.

'ఖుషి' మూవీ నుంచి వచ్చిన మొత్తం అప్‌డేట్లకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ గురించి కీలక విషయాన్ని ప్రకటించారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న 'ఖుషి' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారమే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ధృవీకరించింది. ఇక, ఈ సంస్థ ఆగస్టు 31 నుంచి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా దీన్ని ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది.

స్వచ్చమైన ప్రేమ కథతో రూపొందుతోన్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











