ప్రముఖ టాలీవుడ్ సింగర్ కి వేధింపులు.. ఆమె ఫోటోలను అలా వాడినందుకు ఫిలిం మేకర్ అరెస్ట్!
ఈ మధ్య కాలంలో ఫ్రాడ్ ఎలా జరుగుతుందో కూడా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా విపరీతంగా వాడుకలోకి రావడంతో కేటుగాళ్ళు రకరకాల దారుల్లో డబ్బు కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఒక రకమైన నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక సింగర్ పేరు వాడుకుని ఆమె పేరుతో ఏకంగా ఛానల్ నడిపే ప్రయత్నం చేశాడు ఒక కేటుగాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఊచలు లెక్కింపు వలసిన పరిస్థితి ఏర్పడింది.
టాలీవుడ్‌కు చెందిన ఒక మహిళా గాయకురాలిని వేధించినందుకు గాను కర్ణాటకలోని బెంగళూరులోని అనెకల్ తాలూకాకు చెందిన షార్ట్ ఫిల్మ్‌మేకర్ ఎం నవీన్ కుమార్ ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వయసు 34 సంవత్సరాలు. అందుతున్న సమాచారం మేరకు ఈ వర్ధమాన షార్ట్ ఫిలిం మేకర్ గతంలో ఒక తెలుగు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత, అతను సదరు ప్లే బ్యాక్ సింగర్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించాడు. అంతే కాక అతను బాధితురాలి పేరు మీద ఒక చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. ఆమె ఫోటోనే లోగోగా ఉపయోగించి, నిందితుడు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాడు.

అంతేకాక తన వెబ్ సిరీస్ నుంచి వీడియోలు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లాంటి మరి కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ కార్యకలాపాలు అన్నీ గాయకురాలి దృష్టికి రావడంతో, అలాంటి కార్యకలాపాలను ఆపమని ఆమె కోరింది. ఒకటి రెండు సార్లు పద్దతిగా చెప్పి చూసింది. అయినా నిందితుడు ఆమెను పట్టించుకోకుండా ఆమె పేరును ఉపయోగించడం కొనసాగించాడు. అంతే కాక అతను తన వ్యాపారాన్ని కొనసాగించడానికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వమని సదరు గాయకురాలిని బలవంతం చేశాడు. తనను మానసికంగా వేధించడంతో చివరికి సింగర్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి పోలీసులు శుక్రవారం నవీన్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే సదరు గాయకురాలు ఎవరు ? అనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











