ఆ ఫోటోలు పంపి.. వస్తావా అంటూ.. సింగర్ కార్తీక్‌పై లేడీ సింగర్ షాకింగ్ కామెంట్స్
హేమ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని మహిళల దుస్థితి మరోసారి చర్చనీయాంశమైంది. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల వంటి అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అప్పట్లో కలకలం రేపిన MeeToo ఉద్యమం మరోసారి ఉద్ధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మహిళా నటులు, ఫిమేల్ టెక్నీషియన్స్, సింగర్స్ ఒక్కొక్కరిగా తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్ధితులపై కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. మలయాళ పరిశ్రమలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని హేమ కమిటీ పేర్కొంది. కేరళలో చిత్ర పరిశ్రమ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని .. మహిళలు కనీసం నోరెత్తలేని పరిస్ధితి నెలకొందని కమిటీ అభిప్రాయపడింది.

పరిశ్రమలో పైకి పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న కొందరి నిజస్వరూపాలు కమిటీ నివేదిక తర్వాత ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతున్నాయి. మలయాళంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు , నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలనున పంచుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కమీషన్ వేయాలంటూ స్టార్ హీరోయిన్ సమంత డిమాండ్ చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లోనూ ది వాయిస్ ఆఫ్ వుమెన్ ఏర్పాటైందని.. ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సామ్ కోరారు.
కాగా.. హేమ కమిటీ నివేదికను కోలీవుడ్ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళల రక్షణకు ఓ కమీషన్ ఏర్పాటు చేసినట్లు నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పష్టం చేశారు. ఈ కమీషన్‌లో సీనియర్ నటులు రోహిణి, సుహాసిని కీలకపాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఇలా ఎవరిపై ఫిర్యాదు వచ్చినా తక్షణమే చర్యలు తీసుకుంటామని విశాల్ హెచ్చరించారు.

ఇదిలాఉండగా.. మీటూ ఉద్యమం ఉద్ధృతంగా సాగినప్పుడు సింగర్ చిన్మయి శ్రీపాద పేరు వార్తల్లో నిలిచింది. తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే శ్రీపాద ఆ సమయంలో ఎవరినీ వదిలిపెట్టలేదు. ఈ క్రమంలోనే తన కో సింగర్ కార్తీక్‌పై ఆమె చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. హైదరాబాద్ , చెన్నైలలో చివరికి స్విట్జర్లాండ్‌లోనూ కార్తీక్ బాధితురాళ్లు ఉన్నారని ఆమె ఆరోపించారు. డీప్ ఫోటోలు పంపి.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామా, డేట్‌కు వెళ్దామా అని కార్తీక్ అడిగేవాడని వ్యాఖ్యానించారు. సింగర్‌గా కార్తీక్‌ను తాను ఎంతో గౌరవిస్తానని, తాను కూడా ఈ స్థాయికి వచ్చాక నా స్టేటస్, పవర్‌ను ఇతరులను వేధించడానికి వాడుకోలేదన్నారు.
కార్తీక్‌పై ఆరోపణలు చేసిన తర్వాత తనకు మనో ఫోన్ చేసి.. ఎందుకమ్మా.. మీ ఇద్దరూ కష్టపడి పనిచేశారు. ఇలాంటి వాటి వల్ల కార్తీక్ కెరీర్ పాడైపోతుందని మనో సూచించారని .. కానీ తాను మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్ధితుల్లో లేనని , కార్తీక్‌కు ఆయన ఎందుకు అండగా నిలబడ్డారో అర్ధం కాలేదని చిన్మయి అన్నారు. దీనికి తోడు ఆ సమయంలో కార్తీక్ తనతో కలిసి సరిగమపలో కో జడ్జిగా ఉండటంతో ఏం చేయాలో అర్ధం కాలేదన్నారు. ప్రస్తుతం చిన్మయి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











