ఆ సినిమా వల్లే ఇండస్ట్రీని వదిలేశా.... సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్
సింగర్ స్మిత.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. హాలీవుడ్, బాలీవుడ్‌లకే పరిమితమైన పాప్ కల్చర్‌ని తెలుగులోకి తీసుకొచ్చి ఓ జనరేషన్‌ని ఉర్రూతలూగించారు. పాటలతో పాటు సినిమాలు, యాంకరింగ్, బిజినెస్ ఉమెన్‌గాను సత్తా చాటారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ హఠాత్తుగా వీటన్నింటిని పక్కనపెట్టి ఆధ్యాత్మిక బాటపట్టారు. చాలా ఏళ్ల తర్వాత మసక మసక అంటూ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తాను సినీ పరిశ్రమకు దూరం కావడానికి దారి తీసిన పరిస్థితులపై స్మిత సంచలన వ్యాఖ్యలపై చేశారు.
తెలుగువాళ్లకి పాప్ కల్చర్ పరిచయం చేసిన స్మిత
విజయవాడకు చెందిన స్మిత వల్లూరుపల్లి... 2000వ సంవత్సరంలో హాయ్ రబ్బా అంటూ పాప్ సింగర్‌గా తెలుగునాట సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మసక మసక చీకటిలో అంటూ మరో పాటలో అలజడి రేపింది. కొత్తగా ఉన్న ఈ రీమిక్స్ కల్చర్‌కు అప్పట్లో తెలుగు యువత ఊగిపోయారు. స్మిత కాసెట్లు కూడా బాగా అమ్ముడయ్యాయి. పాప్ సింగర్‌గా ప్రైవేట్ సాంగ్స్ చేయడంతో పాటు సినిమాలలోనూ 75 పాటల వరకు పాడింది. అనుకోకుండా ఒకరోజులో ఎవరైనా చూస్తుంటారా అనే పాటకు గాను ఫిల్మ్‌ఫేర్ నుంచి బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ అందుకున్నారు.

మసక మసక అంటూ రీ ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్‌లో పాప్ కల్చర్‌ను పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన స్మిత.. నటనపై ఆసక్తితో పలు సినిమాలలోనూ నటించింది. కానీ అనూహ్యంగా చిత్ర పరిశ్రమకు దూరమై తిరిగి తన ఆల్బమ్స్‌పై దృష్టి సారించారు. పాప్ సంగీతానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన స్మిత.. ఆ తర్వాత ఈశా ఫౌండేషన్ వాలంటీర్‌గా ఈషానా పేరుతో డివోషనల్ ఆల్బమ్ రిలీజ్ చేసింది. వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టిన స్మిత.. బిజినెస్ ఉమెన్ అనిపించుకున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత మసక మసక చీకటిలో అంటూ ఓ కొత్త పాటను విడుదల చేసి కలకలం రేపారు స్మిత. నేటి యువతరానికి తగిన విధంగా దీనిని రూపొందించారు. నటుడు, మరో ర్యాపర్ నోయెల్‌తో కలిసి దీనిని ఆలపించారు స్మిత. తాజాగా దీని ప్రమోషనల్ కార్యక్రమాలలో స్మిత పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రెస్‌మీట్‌లో తాను సినిమాలు ఎందుకు మానేయాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
ఒక్క దెబ్బకు పారిపోయా
ఒక సినిమా నాకు మిస్ ఫైర్ అయ్యింది. ఒక దెబ్బకి పారిపోయా. నిజం చెప్పాలంటే అమ్మో ఇది అక్కడ వినేది ఒకలాగా ఉంటుంది. తర్వాత వేరేలా ఉంటుంది. దానికి నేను ప్రిపేర్ అవ్వలేను. దానికి ముందు నాకు ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. అమ్మో వద్దు అని నేను ఆగిపోయా. కానీ వెళ్లి వెళ్లి దాంట్లోనే పడ్డా. కుటుంబంలోని వాళ్లంతా నన్ను ఫోర్స్ చేశారు. నువ్వు చేయ్.. నువ్వు ఇబ్బంది పడేది ఏమీ ఉండదు కదా అన్నట్లు తోశారు. ఆ సినిమాలో నేను పనిచేసిన వారంతా సూపర్. కానీ అది నాకు కనెక్ట్ కాలేదు. ఇది మనకి సెట్ అవ్వదని సినిమాలు చేయడం మానేశాను అని స్మిత తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరిగా ఆ సినిమాలో
కాగా.. చివరిగా విక్టరీ వెంకటేష్ హీరోగా కే విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లీశ్వరి సినిమాలో స్మిత నటించారు. ఫ్మామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ మామ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ల భరణి, నరేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంలో స్మిత నెగిటివ్ రోల్‌లో పనిమనిషి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











