ఆ మూడు రోజులు నిద్ర పోలేదు..అనసూయపై శివాజీ కామెంట్స్..
టాలీవుడ్ నటుడు శివాజీ మరోసారి తన వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు యాంకర్-నటి అనసూయ భరద్వాజ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, శివాజీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అదే సమయంలో కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ శివాజీ.. ఆ ఘటనపై తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే?
'మహిళల దుస్తుల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను నిర్ణయించకూడదు. అది నా ఉద్దేశం అస్సలు కాదు' అని శివాజీ స్పష్టం చేశారు. డ్రెస్సింగ్ గురించి మాట్లాడే సమయంలో తాను రెండు పదాలు ఉపయోగించానని, అవి వాడకూడదని ఇప్పటికీ అనిపిస్తోందని చెప్పారు.'ఆ రోజు నేను ఎందుకు అలా మాట్లాడానో నాకే అర్థం కావడం లేదు. ఇప్పటివరకు వందల ప్రెస్‌మీట్లు, డిబేట్స్‌లో పాల్గొన్నాను. ఎప్పుడూ నోరు జారలేదు. కానీ ఆ రోజు మాత్రం అలా జరిగిపోయింది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కామెంట్స్ తర్వాత తనలో తీవ్ర మానసిక సంఘర్షణ మొదలైందని శివాజీ తెలిపారు. 'ఆ ఘటన తర్వాత మూడు రోజులు నాకు నిద్ర కూడా పోలేదు. నేను చెప్పిన మాటల గురించి నేనే పదే పదే ఆలోచించుకున్నాను. అన్ని రోజులు మనవి కావు కదా... ఆరోజు అలా ఎలా మాట్లాడానా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా'అని భావోద్వేగంగా చెప్పారు.
అనసూయపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 'నేను అనసూయను ఏమీ అనలేదు. ఆమెతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఒకసారి ఆమె నన్ను ఇంటర్వ్యూ చేశారు అంతే. ఆ అమ్మాయి అంటే నాకు గౌరవమే. మహిళలను కావాలని కించపరచాలి అనే ఉద్దేశం ఈ ప్రపంచంలో చాలామంది మగవాళ్లకు ఉండదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం' అని వివరించారు.
ఇక మహిళా కమిషన్ వ్యవహారంపై కూడా షాకింగ్ విషయం బయటపెట్టారు శివాజీ. 'నేను మహిళా కమిషన్‌కు వెళ్లినప్పుడు... నాకు బాగా తెలిసిన వాళ్లే నాపై కంప్లైంట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. వారి పేర్లు చెప్పను. అలా చెప్పడం కరెక్ట్ కాదు. అయినా ఇప్పటికీ వాళ్లంటే నాకు గౌరవమే ఉంది' అంటూ సంయమనం పాటించారు.
ఇలా తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మహిళలపై తాను ఎప్పుడూ తక్కువ భావనతో మాట్లాడలేదని శివాజీ మరోసారి స్పష్టం చేశారు. డ్రెస్సింగ్‌ను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం తప్పని, సమాజం కూడా ఇప్పుడు తన ఉద్దేశాన్ని అర్థం చేసుకుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో శివాజీ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. గత తప్పును అంగీకరిస్తూ, భావోద్వేగాలతో స్పందించిన ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











