హీరోయిన్లను అశ్లీలంగా చూపిస్తావ్ .. రాఘవేంద్రరావు ఆఫర్ తిప్పికొట్టిన స్టార్ హీరోయిన్
చిత్ర పరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఎవరో చేయాల్సిన ప్రాజెక్ట్‌లు, సినిమాలు మరోకరు చేస్తుంటారు. ఏవో కారణాలతో నటీనటులు కొన్ని ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవడంతో బ్లాక్‌బస్టర్స్ అనిపించుకున్న సినిమాలు అనవసరంగా చేజార్చుకున్న పరిణామాలెన్నో. డేట్స్ సర్దుబాటు చేయలేకనో, స్టోరీలు నచ్చకో పలువురు హీరోలు, హీరోయిన్లు బంగారం లాంటి అవకాశాలను వదిలేసుకుంటారు. వాటిని మరొకరు చేయడం అవి ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన తర్వాత తప్పు చేసిన ఫీలింగ్‌లో ఉంటారు.
కే. రాఘవేంద్రరావు బీఏ... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన దర్శకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. జానపదాలు, పౌరాణికాలు దుమ్మదులుపుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు కమర్షియల్ సినిమాలు పరిచయం చేశారు రాఘవేంద్రరావు. వందకు పైగా సినిమాలతో దర్శకేంద్రుడిగా నిలిచారు. కమర్షియల్ సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన ఆయన ఎంతో మంది స్టార్స్‌కు సూపర్‌హిట్స్ అందించారు.

నట భూషణ శోభన్ బాబు నటించిన బాబు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్రరావు .. ఎన్టీఆర్‌తో తీసిన అడవిరాముడితో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ తర్వాత వేటగాడు, గజదొంగ, తిరుగులేని మనిషి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి సినామాలతో దూసుకొచ్చారు. ఎన్టీఆరే కాకుండా ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు ఈ తరంలోనూ పలువురు స్టార్స్‌ని డైరెక్ట్ చేశారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వీరే కాదు.. శ్రీదేవి, ఖుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్పాశెట్టి, తాప్సీ వంటి వారిని తెలుగు సినిమాకు పరిచయం చేసి స్టార్స్‌గా తీర్చిదిద్దారు.
హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడంలో రాఘవేంద్రరావు సిద్ధహస్తుడు. కలర్‌ఫుల్‌గా ఉండే ఆయన పాటల్లో పూలు, పాలు, పండ్లను వాడుతూ రొమాంటిక్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కమర్షియల్ సినిమాలే కాదు.. భక్తిరస చిత్రాలు తీయడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, ఓం నమో వెంకటేశ వంటి సినిమాలతో ఆధ్యాత్మికంగానూ తన హవా చూపించారు. అలాంటి రాఘవేంద్రరావు సినిమాలో నటించడానికి ఆఫర్ వస్తే నిర్మొహమాటంగా తిరస్కరించింది ఓ స్టార్ హీరోయిన్.
ప్రముఖ నిర్మాత కే మురారీ, రాఘవేంద్రరావుల దర్శకత్వంలో ఓ సందేశాత్మక చిత్రానికి ప్లాన్ చేశారు. ఇందులో హీరో కృష్ణంరాజు కాగా.. ముగ్గురు హీరోయిన్లను తీసుకోవాలని అనుకున్నారు. ఓ హీరోయిన్‌గా శ్రీదేవి, మరో హీరోయిన్‌గా రాధికను తీసుకున్నారు. ఇక కీలకమైన కథను మలుపుతిప్పే పాత్ర కోసం అప్పటి హిందీ దిగ్గజ నటి స్మితా పాటిల్‌ను మురారీ సంప్రదించారు. అయితే రాఘవేంద్రరావు దర్శకుడు అనేసరికి .. ఆయన హీరోయిన్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపిస్తారని నాకు ఆయనకు సెట్ కాదని ఆఫర్ తిరస్కరించారట.
దీంతో ఈ పాత్రకు జయసుధను ఎంపిక చేశారు. ఈ సినిమా ఏదో కాదు త్రిశూలం. గ్రామాల్లో ఉండే కట్టుబాట్లు, నిరక్షరాస్యత , దేవదాసీ వ్యవస్ధ, అంటరానితనం వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు జయసుధను నటిగా మరో మెట్టెక్కించింది. ఈ క్యారెక్టర్ కనుక స్మితా పాటిల్ చేసుంటే మరోలా ఉండేదని విశ్లేషకులు అంటూ ఉంటారు.


Click it and Unblock the Notifications











