బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్.. వీడియో రెడీ చేసిన మెగా మేనల్లుడు
బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందంటూ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో యూత్ ఆడియన్స్‌ని అలరించేందుకు సిద్దమవుతున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. జయాపజయాలకు లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో ఈ సారి డిఫరెంట్ కథాశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి ఆకట్టుకుంది.

ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు (ఫిబ్రవరి 13) సాయంత్రం 5 గంటలకు ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ''సోలో సోదర సోదరీమణులారా.. ఈ వాలెంటైన్స్ వీకెండ్ మనమంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్ ఒక్కటే.. సోలో బ్రతుకే సో బెటర్'' అంటూ ఇటీవలే ట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఈ వీడియో ద్వారా ఏం చెప్పబోతున్నాడని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
మ్యూజిక్ మాంత్రికుడు తమన్ సంగీతం అందించిన 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ మే 1న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడం విశేషం.


Click it and Unblock the Notifications











