800 అడిగినందుకు .. ఎస్పీ బాలు దగ్గర 20 వేలు గుంజిన అగ్ర హీరో
దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు దశాబ్ధాల పాటు తన సుమధుర గానంతో తెలుగువారిని అలరించారు బాలు. దాదాపు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక పాటలు పడిన నేపథ్య గాయకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. తెలుగువారికి ఆయన పాట వినకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు.
పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో వర్ధమాన గాయకులను చిత్ర సీమకు పరిచయం చేశారు. స్నేహశీలిగా ఇండస్ట్రీలో ఆయనకు పేరు. అలాంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనసును ఓ స్టార్ హీరో నొప్పించారట. ఈ వివాదంతో వీరిద్దరి మధ్య చాలా ఏళ్లు మాటలు లేకపోవడంతో పాటు తన సినిమాలకు పాడొద్దని ఈ హీరో .. ఎస్పీ బాలుకి తేల్చిచెప్పారట. బాలుతో గొడవపడ్డ హీరో ఎవరు? అసలు వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో మంచితనానికి, సాహసానికి మారుపేరుగా నిలిచిన సూపర్‌స్టార్ కృష్ణకు , ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మధ్య కొన్నాళ్లు వివాదం నడిచింది. కృష్ణ హీరోగా వచ్చిన నేనంటే నేనే సినిమాలోని పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఆ ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో బాలు మీద కృష్ణకు అభిమానం ఏర్పడింది. నాటి నుంచి ఇకపై తన ప్రతి సినిమాలోనూ ఆయనకు అవకాశం కల్పించారు. అలా వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా నడవదు అన్నట్లు కొన్నేళ్ల తర్వాత కృష్ణతో వివాదం జరిగింది. బాలు బతికున్న రోజుల్లో చాలా ఇంటర్వ్యూలలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఓ సంస్థ నుంచి తనకు పారితోషికం రావాల్సి ఉందని.. అది నాలుగేళ్లు అయినా రాలేదని దాంతో తాను నిర్మాతతో ఫోన్ చేసి మాట్లాడానని బాలు తెలిపారు. తాను ఫోన్ పెట్టిన వెంటనే కృష్ణగారు ఫోన్ చేశారని.. మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావు అన్నారటగా అని ప్రశ్నించారని బాలు వెల్లడించారు. నా తత్వం ఏంటో మీకు తెలుసు.. మీకు ఎవరు ఇలా మోశారో నాకు తెలియదని కృష్ణతో అన్నానని బాలు చెప్పారు.
నేను పాడకపోయినా మీ సినిమాలు బాగా ఆడతాయి.. ఇంకో సింగర్‌కి అవకాశం వస్తుందని, మీరు నాకు ఇవ్వకపోయినా నాకు ఇచ్చేవాళ్లు ఇస్తారని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మీ మిత్రుడి సినిమాలో నేను యాక్ట్ చేశానని.. ఆ సినిమాకు రావాల్సిన రూ.20 వేలు పంపించమని కృష్ణ సీరియస్‌గా చెప్పారని , దానికి ఎంతో బాధపడి వెంటనే 20 వేల రూపాయలు పంపించానని బాలు గుర్తుచేసుకున్నారు. నాకు రావాల్సింది కేవలం రూ.800 మాత్రమేనని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంత గొడవ జరిగినా తామిద్దరం స్నేహితులుగానే మెలిగామని.. కానీ కలిసి పనిచేయడం మాత్రం జరగలేదని ఆయన వెల్లడించారు.
మా ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్ల రాజ్ సీతారాంను కృష్ణ బాగా ప్రోత్సహించారని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఇలా జరుగుతుండగా రాజ్ కోటి ఒకరోజు తన దగ్గరికి వచ్చి మా పాటలు పాడైపోతున్నాయని మీరు కృష్ణగారికి పాడాల్సిందేనని బాధపడ్డారని బాలు తెలిపారు. వేటూరి సుందరామ్మూర్తి గారు కృష్ణను , నన్ను కలిపేందుకు కృషి చేశారని చెప్పారు. ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాలని పద్మాలయా ఆఫీసుకి వెళితే స్టాఫ్ మొత్తం షాకయ్యారని.. నేరుగా కృష్ణ దగ్గరికి వెళితే జరిగినదంతా నాకు అనవసరమని వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications











